Social 1080×1350 • Multi-page
27-09-2024 BREAKING NEWS 05:29 AM
swarnodayam.com
Telugu Daily News

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు
IMG_20240927_162654

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాడిన స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి పురస్కరించుకొని యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో కీలక భూమిక పోషించి రాజకీయ నాయకుడిగానే కాదు, రాజనీతిజ్ఞుడిగా విశేష కీర్తి పొంది చరిత్ర పుటల్లో స్వయం కృషితో తన పేరును తనే లిఖించుకున్న గొప్ప ప్రజ్ఞాశాలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ఉద్యమాలే జీవితంగా బతికి, తన సర్వస్వాన్ని ప్రజల కోసం ధారపోసిన ధీశాలి బాపూజీ అని వెల్లడించారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకోవడమే కాకుండా తెలంగాణ వచ్చే వరకు ఏ ఒక్క పదవిని తీసుకోనని చెప్పి ఆచరించిన మహా నిష్టాగరిష్ఠుడు బాపూజీ అని తెలిపారు. నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన తరగతుల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, స్వాతంత్ర్యోద్యమం, ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలు చేసిన బహుముఖ పోరాట యోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. బాపూజీ లాంటి నిస్వార్థ నాయకుల పోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు. బాపూజీ లాంటి మహనీయులకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి సమూచిత స్థానం కల్పిస్తున్నారని అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన యూనివార్సిటీకి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టారని తెలిపారు. బాపూజీ లాంటి నాయకులు చేసిన పోరాటాల నుండి ప్రతీ ఒక్కరూ స్ఫూర్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు సందమల్ల నరేష్, టేకుల శ్రావణ్, పర్లపల్లి నాగరాజు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంత రమేష్, సందమల్ల బాబు, దుబాసి బాబు, బిఆర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు నరేడ్ల వినోద్ రెడ్డి, గంట కిరణ్ రెడ్డి, చల్లురి విష్ణువర్ధన్, దొమ్మటి వెంకన్న, ముక్క రమేష్, ముక్క రవితేజ, ఎర్ర అనిల్, రాజేష్, మణిదీప్, అజిత్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!