30-09-2024 NORMAL NEWS 03:42 AM
swarnodayam.com
Telugu Daily News
30-09-2024 03:42 AM By Mandala Yadagiri

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్.. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రుల బంధువుల ఆందోళన

చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్.. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తల్లిదండ్రుల బంధువుల ఆందోళన
Oplus_0


మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (ముస్తాబాద్): రాజన్న సిరిసిల్ల జిల్లాలో స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యంతో ఓ చిన్నారి దుర్మరణం చెందడం విషాదం నింపింది. స్కూల్‌ బస్సు కిందపడి మూడేండ్ల చిన్నారి దుర్మరణం చెందిన విషాదకర సంఘటన సిరిసిల్లా జిల్లా ముస్తాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

అప్పటి వరకు కండ్లముందు ఆడి పాడిన ఆ చిన్నారి క్షణాల్లోనే మృత్యు ఒడిలోకి చేరడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ముస్తాబాద్‌లో స్కూల్ బస్సు కిందపడి మూడేండ్ల బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. పాప మృతికి పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ చిన్నారి తల్లిదండ్రులు సంబంధిత మహర్షి స్కూల్ ఎదుట ఆందోళన చేపట్టారు. బంధువుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థినీ బలిగొన్న మహర్షి స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలి.
-విద్యార్ధినీ కుటుంబానికి న్యాయం చేయాలి.
-ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి.

పిడిఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పట్టణంలో గల మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ఆవరణలో బస్సు టైర్ల కింద పడి మృతిచెందడం, ఇంతటి నిర్లక్ష్యానికి కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేసి, ఆ స్కూల్ ని సీజ్ చేయాలని పిడిఎస్ యు ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి మత్తులో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా లైసెన్సులు జారీ చేయడం, ఎలాంటి అనుభవం లేకుండా డ్రైవర్లను కొనసాగించడం, విద్యా సంస్థలకు విచ్చలవిడిగా అనుమతులు ఇవ్వడం వల్ల ఇలాంటి ఘటన జరుగుతున్నాయని అయన ఆరోపించారు. వెంటనే ఆ పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి జైలుకు పంపాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అంగిడి కుమార్ హెచ్చరించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!