05-10-2024 NORMAL NEWS 10:19 AM
swarnodayam.com
Telugu Daily News
05-10-2024 10:19 AM By Mandala Yadagiri

రాజపల్లిలో అమానవీయ ఘటన..! ఆస్తి కోసం తల్లిదండ్రులతో కలిసి అన్నను చంపిన తమ్ముడు. – హంతకులను 24 గంటలు గడవకుండానే అరెస్ట్ చేసిన పోలీసులు.

రాజపల్లిలో అమానవీయ ఘటన..! ఆస్తి కోసం తల్లిదండ్రులతో కలిసి అన్నను చంపిన తమ్ముడు. – హంతకులను 24 గంటలు గడవకుండానే అరెస్ట్ చేసిన పోలీసులు.
IMG_20241005_211716

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వ్యసనాలకు అలవాటు పడిన తమ్ముడు అన్న పేరున ఉన్న ఆస్తిపై కన్ను వేసి, ఎలాగైనా సొంతం చేసుకోవాలని తల్లిదండ్రులతో కలిసి పన్నాగం పన్నాడు. రక్త, పేగు సంబంధాన్ని మరిచి కర్కశగా మారి ఆ కన్న తల్లిదండ్రులు హత్యకు సహకరించడం శనివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాజపల్లి గ్రామంలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… హుజురాబాద్ మండలం రాజపల్లి గ్రామానికి చెందిన నోముల రాజు (30) శుక్రవారం రాత్రి అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. ఉదయం తల్లిదండ్రులు నోముల చంద్రయ్య, ఎల్లమ్మలు ఇంటి ముందుకు వచ్చి మా కుమారుడు లేవడం లేదని చుట్టు పక్కల వారికి తెలిపారు. వారు ఇంట్లోకి వెళ్లి చూడగా మంచంపై రాజు శవమై ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ఐ యూనస్ లు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి రాజు హత్యకు గురైనట్లు గుర్తించారు. మంచంపై విగతజీవిగా ఉండగా అతని నుదిటిపై ఆయుధంతో(రోకలి బండతో) దాడి చేసిన గాయాలున్నాయి. మంచం చుట్టూ రక్తం మరకలు ఉండగా కర్రతో గాయపరిచి చంపి ఉంటారని పోలీసులు గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు, సోదరుడు అంజిలను అదుపులోకి తీసుకొని విచారించగా తండ్రి చంద్రయ్య, తల్లి ఎల్లమ్మ సహకరించగా సోదరుడు అంజి రోకలి బండతో మోది చంపినట్లు ఒప్పుకున్నారన్నారని ఏసీపి తెలిపారు. మృతుడు రాజు పేరున ఉన్న ఆస్తి కోసం రాజును హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు చెప్పారు. అంజి తాగుడుకు అలవాటు పడి జల్సాగా తిరుగుతుండడంతో అతని భార్య వదిలేసి వెళ్లగా, తల్లిదండ్రులను అన్నను డబ్బుల కోసం తరచూ వేధించేవాడన్నారు. అందుకే రాజు పలుమార్లు మందలించగా దానిని మనసులో పెట్టుకొని అతని అడ్డు ఎలాగైనా తొలగించుకుంటే అతని పేరున ఉన్న ఆస్తి నాలుగు ఎకరాల భూమి కూడా తనకే వస్తుందని తల్లిదండ్రులతో కలిసి కుట్రపన్ని అతని హత్యకు పథకం రచించినట్లుగా పోలీసుల విచారణలో ఒప్పుకున్నారన్నారు. కరీంనగర్ నుండి క్లూస్ టీం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలు సేకరించారు. హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని పలుకోణాల్లో ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్య కేసులో మృతుని సోదరుడు అంజి, తల్లిదండ్రులు చంద్రయ్య, ఎల్లమ్మలను శనివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు ఏసిపి శ్రీనివాస్ జి, టౌన్ సిఐ తిరుమల్ గౌడ్ తెలిపారు. 24 గంటలు గడవకముందే నిందితులను హత్య కేసులో అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన హుజురాబాద్ టౌన్ సిఐ తిరుమల్ గౌడ్, ఎస్ ఐ, సిబ్బందిని ఏసీపితో పాటు గ్రామస్తులు అభినందించారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!