Social 1080×1350 • Multi-page
04-11-2024 BREAKING NEWS 06:13 AM
swarnodayam.com
Telugu Daily News

ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి పాట్లు వద్దు..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుంది. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి పాట్లు వద్దు..కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతుంది. -హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG_20241104_170905

ఐకెపిలో 15 రోజుల నుంచి గింజ కూడా వడ్లు కొనడం లేదు

కెసిఆర్ ఎమ్మెల్యేల జీతాలు ఆపారు రైతుబంధు ఆపలేదు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలి, వారి పాట్లు అవసరం లేదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి విమర్శించారు. సోమవారం కమలాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమలాపూర్ లో ఐకెపి సెంటర్ లో రైతులు ధాన్యం తీసుకువచ్చి 15 రోజులు గడుస్తున్న ఇప్పటివరకు కొనకపోవడం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులను అన్ని విధాల ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు నట్టేట ముంచేస్తుందన్నారు. సంవత్సరానికి మూడుసార్లు రైతుబంధు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసిందని 60% రైతు రుణమాఫీ ఇప్పటివరకు కాలేదన్నారు. సన్నవడ్లు పండిస్తే 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు కొనుగోలు సమయంలో పలు ఆంక్షలు పెట్టి ఎగగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో బోనస్ విషయంలో సన్నవడ్లు, దొడ్డు వడ్లు అని చెప్పలేదని అన్నారు. 30 రకాల సన్నవడ్లు రైతులు పండిస్తే కేవలం 18 రకాల వడ్లనే బోనస్ ఇస్తామని చెప్పడంతో రైతులు తీవ్ర అసహనంగా ఉన్నారన్నారు. సన్న వడ్లను గుర్తించేందుకు కొత్తగా మిషన్లు తీసుకువచ్చి దానిలో ఒక గింజను వేసి నిర్ధారించడం ఎంతవరకు సరైందని ఆయన అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం లో 90% దొడ్డు వడ్లనే పండిస్తారని అన్నారు. రైతులను రుణమాఫీ, బోనస్, రైతు బీమా, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దిగముంచిందన్నారు. రైతులు ప్రభుత్వానికి అమ్మిన వడ్లకు కూడా డబ్బులు ఇస్తారో లేదో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇప్పటివరకు ఆ మక్కల కొనుగోలు సెంటర్ కూడా ఏర్పాటు చేయలేదని, అలాగే పత్తి పండించిన రైతులకు కూడా 7000 నుంచి 7500 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం 5000 కూడా ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఇప్పటివరకు ఏ కొనుగోలు సెంటర్లో ఒక గింజ కూడా కొనలేదని దీనిపై చర్చకు సిద్ధమని ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతులపై ఎనలేని ప్రేమ ఉందని, అందుకే 10 సంవత్సరాల పాలనలో రైతుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. కరోనా సమయంలో కూడా 5000 కోట్ల నష్టం వస్తుందని తెలిసినప్పటికీ ప్రతి గింజను కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కరోనా సమయంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపారే తప్ప రైతుబంధు ఆపలేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హుజురాబాద్ నియోజకవర్గం లోని రైతులు పండించిన ప్రతి గింజను వెంటనే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజి జడ్పీటీసీ సభ్యులు కళ్యాణి లక్ష్మణ్, నవీన్, సింగిల్ విండో వైస్ చెర్మెన్ ఇంద్రసేనారెడ్డి, కేడీసీసీ డైరెక్టర్ కృష్ణప్రసాద్, కమలాపూర్ మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, కమలాపూర్ మాజీ ఎంపీటీసీలు అశోక్, మెండు రమేష్, మాట్లా వెంకటేశ్వర్లు, కమలాపూర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మరియు ఇతర గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!