11-01-2025 NORMAL NEWS 08:43 PM
swarnodayam.com
Telugu Daily News
11-01-2025 08:43 PM By Mandala Yadagiri

సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి శ్రీధర్ బాబు

సరస్వతి అంతర్వాహిని పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి: మంత్రి శ్రీధర్ బాబు
Oplus_131072

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ముక్తీశ్వర ఆలయం, గోదావరి సంగమ తీరంలోని పుష్కర ఘాట్లను కాశి, హరిద్వార్, ప్రయాగ పుణ్యక్షేత్రాల స్థాయిలో అభివృద్ధి చేసేందుకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మే 15 నుంచి 26 వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి నది అంతర్వాహిని పుష్కరాల ఏర్పాట్లను సమీక్షించేందుకు శనివారం నాడు సచివాలయంలో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన అధికారులనుద్దేశించి మాట్లాడారు. పర్వదినాల సందర్భంగా చేసే ఏర్పాట్లలాగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలన్నిటిని అత్యాధునిక వసతులతో కళాత్మకంగా రూపొందిచాలని శ్రీధర్ బాబు సూచించారు. సరస్వతి పుష్కరాలు దేశంలో మరెక్కడా జరగవని, కాళేశ్వరం సంగమ స్థలంలో మాత్రమే వందల ఏళ్లుగా నిర్వహిస్తున్నారని ఆయన వెల్లడించారు. పుష్కరాల ఏర్పట్లు, స్నాన ఘట్టాల ఆధునీకరణ, శానిటేషన్ పనుల కోసం కేటాయించిన రూ.25 కోట్ల నిధులను సద్వినియోగం చేసి కాళేశ్వరం ప్రతిష్ఠ నలుదిశలా వ్యాపించేలా కృషి చేయాలని అన్నారు. తెలంగాణా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రల కూడలిలో గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి స్రవంతి కలిసే చోటు అత్యంత పవిత్రమైన సంగమమని ఆయన గుర్తు చేసారు. ‘స్నాన ఘట్టాలను ఆధునికంగా నిర్మించాలని, రోడ్లను పునర్మించి, విస్తరించడం, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన పనులను వేగం పూర్తి చేయాలన్నారు. పుష్కరాల నిర్వహణ కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, హెలికాప్టర్ జాయ్ రైడ్ల కోసం హెలిపాడ్లకు మరమ్మతులు చేసి సిద్ధం చేయాలన్నారు. ఆలయ పర్యాటక ప్రదేశంగా కాళేశ్వరానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఏడాది పొడవునా భక్తులు వచ్చేలా ఎక్కడ రాజీ పడకుండా మౌలిక వసతుల నిర్మాణాలు చేపట్టాలన్నారు. పేరున్న కన్సల్టెంట్ సంస్థలను నియమించుకునే స్వేచ్ఛ మీకుందని, దేవాదాయ, నీటి పారుదల, రోడ్లు భవనాలు, పంచాయతీరాజ్, రెవిన్యూ, టూరిజం, ట్రాన్స్ కో, ఆర్టీసి అధికారులంతా కలిసి ఎక్కడా ఇబ్బంది లేకుండా ఏర్పాట్లలో పాలు పంచుకోవాలన్నారు. కాళేశ్వరంలోని ఆర్టీసి బస్ స్టేషన్ ఉన్న ప్రదేశంలో అత్యాధునిక, ఆకర్షణీయమైన నూతన బస్ స్టేషన్ ను నిర్మించాలని, అత్యాధునిక వీధి దీపాలు, ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, వీటి కోసం రూ.62 లక్షల నిధులు ఇప్పటికే విడుదలయ్యాయన్నారు. కొత్త జనరేటర్ సెట్ లను కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచాలని, ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు నిర్వహించనున్న కుంబాభిషేకం పనులను కూడా ఎక్కడా లోపం లేకుండా చేపట్టాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ, దేవాదాయ కమిషనర్ ఇ.శ్రీధర్, జాయింట్ కమిషన్ రామకృష్ణారావు, ఎస్ ఈ దుర్గాప్రసాద్, టూరిజం ఎండీ ప్రకాశ్, ట్రాన్స్ కో ఎస్ ఈ మల్సూర్ నాయక్, ఆర్ డబ్ల్యు ఎస్ ఇఇ నిర్మల, డిపిఓ నారాయణరావు, ఇరిగేషన్ ఇఇ తిరుపతి, డిపిఆర్వో శీలం శ్రీనివాసరావు, కాళేశ్వరం ఇఓ మారుతి, భూపాలపల్లి ఆర్టీసీ డివిజనల్ మేనేజర్, డిఎం ఇందు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!