29-05-2025 NORMAL NEWS 06:51 PM
swarnodayam.com
Telugu Daily News
29-05-2025 06:51 PM By Mandala Yadagiri

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్…అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మావోయిస్టు కీలక నేత హిడ్మా అరెస్ట్…అతడి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
IMG-20250529-WA0188

స్వర్ణోదయం ప్రతినిధి, ఒడిశా(కోరాపుట్‌): మావోయిస్టు ​కీలక నేత హిడ్మా అరెస్టయ్యాడు. మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో ఉన్న హిడ్మాను ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్‌లో హిడ్మాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గతంలో హిడ్మా హతమైనట్లు వార్తలు వచ్చినా అది వాస్తవం కాదని తేలింది. అయితే అప్పట్నుంచి మోస్ట్‌వాంటెడ్‌ లిస్ట్‌లో ఉన్న హిడ్మా తాజాగా ఒడిశా పోలీసులకు చిక్కాడు. చాలాకాలం పాటు కనీసం ఫోటో కూడా లేకుండా తిరిగిన నేపథ్యం హిడ్మాది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ హిడ్మా. ‌5తరగతి వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 44 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేశాడు. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు నిర్వహిస్తోంది.

చేతిలో నెంబర్ వన్ బెటాలియన్
దాదాపు మూడు దశాబ్దాలుగా ఛత్తీస్ఘడ్ మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా ఎదిగిన హిడ్మా… ఆర్మీ స్ట్రాటజీలలో దిట్ట. మావో సిద్ధాంతాన్ని పెద్దగా చదువుకోకపోయినా… తుపాకి ద్వారా పార్టీలో హిడ్మా పాపులారిటీ పెరుగుతూ వచ్చింది. సుక్మా జిల్లాలో పుట్టిన హిడ్మా 17ఏళ్ల వయసులోనే… పీపుల్స్‌వార్‌లో దళ సభ్యుడిగా పార్టీలో చేరాడు. ఆ తరువాత మావోయిస్టు పార్టీలో అంచలంచెలుగా కీలక పాత్ర పోషించాడు. మావోయిస్టు పార్టీలో ఉన్న నెంబర్-1 బెటాలియన్ ప్రస్తుతం హిడ్మా చేతిలో ఉంది. హిడ్మా ఆదేశాలు ఇస్తే ఈ బెటాలియన్ ఎక్కడైనా విరుచుకుపడుతుంది. మావోయిస్టు పార్టీకి చెందిన అత్యంత భయంకరమైన బెటాలియన్‌గా సుగ్మా టీంకు పేరుంది.
2011లో ఛత్తీస్‌ఘడ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన చింతల్నార్ దాడిలో దాదాపు 75మంది CRPF జవాన్లు చనిపోయారు. అప్పట్లో సంచలనంగా మారిన ఈ దాడికి హిడ్మా నాయకత్వం వహించాడు. ఇక 2017లో జరిగిన బూర్కపాల్ దాడిలోనూ హిడ్మా పాత్ర ఉందని మావోయిస్టు పార్టీయే ప్రకటించింది. వందలమంది మిలిటెంట్లను గెరిల్లా ఆర్మీతో ఏకం చేసి దాడి చేయడం ఇతడి ప్రత్యేకత. హిడ్మా దాడి చేస్తే ఎవరూ తప్పించుకోరని మావోయిస్టు పార్టీలో ఒక నమ్మకం. ఛత్తీస్‌ఘడ్‌లో గత రెండు దశాబ్దాల్లో జరిగిన ప్రధాన హింసాకాండలకు హిడ్మాయే కారణం అని అక్కడి పోలీసులు చెబుతారు.

చాలాకాలం వరకూ హిడ్మా గురించి మావోయిస్టు క్యాడర్లోనే చాలా మందికి తెలియదు. అయితే మావోయిస్టు కేంద్ర కమిటీలోకి హిడ్మాను తీసుకోవడంపై పార్టీలో అప్పట్లో చాలా విబేధాలు వచ్చాయి. మావోయిస్టు పార్టీలో అత్యంత నిర్ణాయకమైన కేంద్రకమిటీలోకి ఎలాంటి సిద్ధాంత జ్ఞానం లేని హిడ్మాను తీసుకోవడం అంటే హింసను ప్రోత్సహించడమే అని కొంత మంది మావోయిస్టు సానుభూతిపరులు విమర్శించారు.

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాన్ని వదిలి పూర్తిగా హింసామార్గాన్ని అందుకుందని హిడ్మాకు వ్యతిరేకంగా వాదనలు వచ్చాయి. మనుషుల్ని చంపడంలో హిడ్మా చేసే హింస ఎంతో భయంకరంగా ఉంటుందని చెబుతారు. ముఖ్యంగా ఇన్ఫార్మర్ల నెపంతో హిడ్మా కిరాతక హత్యలకు పాల్పడినట్లు చాలా చర్చ ఉంది. తన నీడను కూడా హిడ్మా నమ్మడని… దాదాపు 10మంది వరకు రాత్రింభవళ్లు హిడ్మాకు పహరా కాస్తారని మాజీ మావోలు చెబుతారు.

హిడ్మా భార్య కూడా మావోయిస్టు పార్టీలోనే పనిచేస్తున్నారు..పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్‌ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్‌ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్‌ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిగిలిన సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు.
హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ..

2010 ఏప్రిల్‌ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్‌ ప్రొటెక్షన్‌ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు.
2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుమృతి చెందారు.
2017 ఏప్రిల్‌ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుర్కాపాల్‌ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.
2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు.
2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.

మావోయిస్టు నేత హిడ్మాను అరెస్టు చూపిస్తున్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పోలీసులు.

హిడ్మా నుంచి పెద్ద ఎత్తున స్వాధీనం చేసుకున్న బాంబులు, మందు గుండు సామాగ్రి, తుపాకులు..

పోలీసులకు దొరికిపోయిన మావోయిస్టు అగ్రనేత హిడ్మ

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!