Social 1080×1350 • Multi-page
04-06-2025 BREAKING NEWS 06:47 PM
swarnodayam.com
Telugu Daily News

సైదాపూర్ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ చర్యలు

సైదాపూర్ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ చర్యలు
IMG-20250604-WA0121

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, జూన్ 04: గత నెల 08వ తేదీన సైదాపూర్ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో జరిగిన ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ గారు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన నివేదిక ఆధారంగా సంబంధిత పోలీస్ సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

గత నెల 08వ తేదీన సైదాపూర్ పోలీస్ స్టేషన్ ప్రొబెషనరీ ఎస్సై అగస్త్య భార్గవ్ మరియు కానిస్టేబుళ్లు ఆకాష్, అజయ్ రోజువారి విధుల్లో భాగంగా సైదాపూర్ శివారులో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో హుస్నాబాద్‌కు చెందిన బత్తుల మహేందర్ (తండ్రి మల్లయ్య) ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, మహేందర్ పోలీసులతో వాదనకు దిగి, దుర్భాషలాడుతూ విధులకు ఆటంకం కలిగించాడని కానిస్టేబుల్ అజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా, వాహనదారుడు బత్తుల మహేందర్ ఈ ఘటనపై కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ గారికి ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీపీ హుజురాబాద్‌ను పూర్తి స్థాయిలో పారదర్శకంగా, నిస్పక్షపాతంగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కమిషనర్ ఆదేశించారు.
ఏసీపీ హుజురాబాద్ సమర్పించిన నివేదిక ఆధారంగా, వాహన తనిఖీలు జరుగుతున్నప్పుడు వాహనదారుడు బత్తుల మహేందర్ తన వాహనాన్ని ఎందుకు ఆపారని ప్రశ్నిస్తూ, పోలీసులను దూషిస్తూ, విధులకు ఆటంకం కలిగించారని, ఈ క్రమంలో పోలీసులు మరియు వాహనదారుడికి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుందని, పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు అవసరానికి మించి బలప్రయోగం చేసారని తేలిందన్నారు.

అయితే, బాధితుడి నుంచి అందిన ఫిర్యాదు మేరకు బాధితుడికి న్యాయం చేసేందుకు గాను, ఆ రోజు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు ఆకాష్ మరియు అజయ్‌లపై క్రమశిక్షణా చర్యల్లో భాగంగా వారికి ఛార్జ్ మెమో జారీ చేసి పోలీస్ స్టేషన్ విధులనుండి తప్పిస్తూ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఇక ట్రైనీ ఎస్సై అగస్త్య భార్గవ్‌పై క్రమశిక్షణా చర్యల నిమిత్తం మల్టీ జోన్ ఐజీపీ కి నివేదిక కూడా పంపినట్లు తెలిపారు.

ఈ ఘటనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వార్తల్లో వస్తున్న కథనం పూర్తి అవాస్తవం అని కమిషనర్ స్పష్టం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసిన వారికీ శిక్ష తప్పదని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పునరుద్ఘాటించారు.

సిపి గౌస్ ఆలం ఐపీఎస్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!