15-06-2025 NORMAL NEWS 02:03 PM
swarnodayam.com
Telugu Daily News
15-06-2025 02:03 PM By Mandala Yadagiri

గోదావరిలో యువకుల మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం

గోదావరిలో యువకుల మృతి పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం
IMG-20250615-WA0067

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదిలో స్నానం చేస్తూ ఐదుగురు యువకులు దుర్మరణం చెందిన ఘటనపై రవాణా శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన యువకులు బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చి, ఈ రోజు ఉదయం గోదావరి నదిలో స్నానం చేస్తుండగా గల్లంతై మృతి చెందడం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి దుర్ఘటనలు వరుసగా జరుగుతున్నాయనీ, జనవరిలో కొండపోచమ్మ సాగర్‌లో ఐదుగురు, వారం క్రితం మేడిగడ్డ ప్రాజెక్టులో ఆరుగురు యువకులు మృతి చెందిన దుర్విపరీత ఘటనలు గుర్తుచేశారు.

నదులు, ప్రాజెక్టులు, కాలువల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి సూచించారు. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. లోతైన ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. యువత భవిష్యత్తు వెలుగు కోసం జీవించాల్సిన వయస్సులో ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మరణించిన యువకుల ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఓర్పు ప్రసాదించాలని ప్రార్థిస్తూ, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలుపుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!