Social 1080×1350 • Multi-page
17-06-2025 BREAKING NEWS 11:08 PM
swarnodayam.com
Telugu Daily News

మణప్పురం ఫైనాన్స్‌కు రూ. 22 లక్షల టోకరా: కళ్లు గప్పి ఉడాయించిన కేటుగాడు!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, జూన్ 17: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థకు ఊహించని షాక్ తగిలింది. మణప్పురం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల కళ్లుగప్పి రూ. 22 లక్షలకు పైగా కొట్టేసి ఉడాయించాడో కేటుగాడు. నమ్మకంగా నటించి, చాకచక్యంగా మోసగించిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
వివరాల్లోకి వెళ్తే.. సైదాపూర్ మండలం జాగిరిపల్లికి చెందిన నెల్లి కృష్ణ అనే వ్యక్తి డబ్బుల కోసం హుజూరాబాద్‌లోని మణప్పురం ఫైనాన్స్‌ను ఆశ్రయించాడు. తన కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలు వేరే రుణ బ్యాంకులో తాకట్టులో ఉన్నాయని, వాటిని విడిపించుకోవడానికి రూ. 22,46,500 రుణం కావాలని కోరాడు. అతడి మాటలు నమ్మిన మణప్పురం ఫైనాన్స్ మేనేజర్, మరో ఉద్యోగి కృష్ణతో కలిసి అతడు చెప్పిన రుణ బ్యాంకుకు వెళ్లారు.
అక్కడ రుణ మొత్తం చెల్లించేందుకు సిద్ధమైన ఫైనాన్స్ ఉద్యోగులు, కృష్ణకు డబ్బు అప్పగించారు. అయితే, కృష్ణ డబ్బులు తీసుకున్న వెంటనే, మణప్పురం ఫైనాన్స్‌లో రుణం తీసుకుంటానని చెప్పి, అందరి కళ్లుగప్పి మూత్రశాలకు వెళ్తున్నట్లుగా నటించి అక్కడి నుంచి జారుకున్నాడు. కృష్ణ కనిపించకపోవడంతో అవాక్కైన ఫైనాన్స్ ఉద్యోగులు వెంటనే అతడి కోసం గాలించారు. కానీ, అప్పటికే కృష్ణ పరారయ్యాడు. మోసపోయామని గ్రహించిన మణప్పురం ఫైనాన్స్ ఉద్యోగులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు చేయలేదని, సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి సమగ్ర విచారణ జరుపుతామని సీఐ కరుణాకర్ వివరించారు. ఈ ఘటనతో ప్రైవేట్ చిట్టి ఫండ్ సంస్థలు ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ మోసం ప్రైవేటు బ్యాంకు సంస్థలకు సవాలు విసిరింది. కృష్ణ అనే వ్యక్తి గతంలో కూడా పలువురిని నమ్మించి ఈ విధంగానే మోసగించినట్లుగా తెలుస్తుంది. పోలీసులు లోతుగా విచారణ జరిపితే కృష్ణ లీలలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!