19-07-2025 NORMAL NEWS 11:21 PM
swarnodayam.com
Telugu Daily News
19-07-2025 11:21 PM By Mandala Yadagiri

హుజురాబాద్ నియోజకవర్గంలో…రోజు రోజుకు వేడెక్కుతున్న బిజెపి రాజకీయం!- బండి – ఈటల వర్గాల ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి!?

హుజురాబాద్ నియోజకవర్గంలో…రోజు రోజుకు వేడెక్కుతున్న బిజెపి రాజకీయం!- బండి – ఈటల వర్గాల ఆధిపత్య పోరులో ఎవరిది పై చేయి!?
IMG-20250719-WA0088

అధిష్ఠానానికి చేరిన పంచాయతీ.. ఇరువురిలో తల దురిస్తే చర్యలు అధిష్టానం హెచ్చరిక

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ రాష్ట్ర రాజకీయాలకు మరోసారి కేంద్ర బిందువుగా మారింది. హుజురాబాద్ బీజేపీలో రెండు గ్రూపుల పోరు తారాస్థాయికి చేరింది. కేంద్ర హోం శాఖా సహాయమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మాజీ మంత్రి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ వర్గాల మధ్య పోరు రోజురోజుకు ఉదృతం అవుతుంది.

నేపథ్యం ఇదీ.. !

ఈటల రాజేందర్ 2020లో బిఆర్ ఎస్ కు రాజీనామా చేసి బిజెపి లో చేరి హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటల హుజురాబాద్ అసెంబ్లీ స్థానంలో ఓటమి చెందారు. ఐతే 2023 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో బండి సంజయ్ గెలుపొందగా.. ఈటల మల్కాజిగిరి స్థానం నుండి గెలుపొందారు. కాగా ఈటల మల్కాజిగిరి ఎంపీగా గెలుపొందిన తర్వాత అయన ఇక్కడకు రావడం తక్కువైంది. ఐతే హుజురాబాద్ నియోజకవర్గంలో ఈటలకు బలమైన అనుచర గణం ఉంది.

విభేదాలకు కారణం ఏమంటే?

ప్రస్తుతం బీజేపీ పార్టీ యంత్రాంగం మంత్రాంగం అంతా కేంద్ర మంత్రి బండి సంజయ్ కనుసన్నల్లో నడుస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాల్లో ఈటల వర్గానికి తగినంత ప్రాతినిధ్యం లభించడం లేదని ఆ వర్గం వాపోతోంది. నిజానికి ఈటల మొదట కేంద్ర మంత్రి పదవి ఆశించారు. కానీ రాలేదు. చివరకు ఈటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి లభిస్తుందని అయన వర్గం భావించింది. కానీ చివరి క్షణంలో బండి సంజయ్ కుట్రల వల్లే.. ఈటలకు అధ్యక్ష పదవి రాలేదనే ప్రచారం ఒక వర్గంలో బలంగా ఉంది.

కమలంలో చిచ్చురేపిన బండి బర్త్ డే గిఫ్ట్ (సైకిళ్ళ) పంపిణీ.

ఇటీవల హుజురాబాద్ లో బండి సంజయ్ ప్రభుత్వ పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు తన బర్త్ డే గిఫ్ట్ గా మొదలెట్టిన సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఇక్కడ నిర్వహించగా ఈటల వర్గానికి ఎలాంటి ఆహ్వానం, సమాచారం లేదు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో కూడా ఈటల ఫోటోలు లేవు. దీనిపై ఈటల వర్గం ఆగ్రహనికి గురైంది. ఐతే.. హుజురాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీలో వర్గాలు, గ్రూపులు లేవని, అందరు పార్టీకోసం పని చేయాల్సిందేనని, ఎవరైనా గ్రూపులు కడితే.. కఠిన చర్యలు తీసుకుంటామని, వారికీ స్థానిక ఎన్నికల్లో టికెట్లు ఇవ్వమని స్పష్టం చేసారు. అంతేగాక తన గెలుపు కోసం కృషి చేసిన వారు ఎవరు తనకు వ్యతిరేకంగా పనిచేసిన వారు ఎవరో తన వద్ద పూర్తి సమాచారం ఉందని సున్నితంగా హెచ్చరించడం కూడా జరిగింది. దీంతో అదే రోజు సాయంత్రం హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ గా ఉన్న ఈటల అనుచరుడైన మాడ గౌతమ్ రెడ్డి ప్రణాళికా ప్రకారంగా అవమానాలకు గురి చేస్తూ, పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ బీజేపీ కి రాజీనామా చేయడం సంచలనం రేపింది.

శామీర్ పేట్ కు పెద్ద ఎత్తున తరలిన ఈటల శ్రేణులు !!

హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీలో బండి, ఈటల వర్గాల ఆధిపత్య పోర్టు తారా స్థాయికి చేరుతోంది. తాజాగా శనివారం ఈటల రాజేందర్ వర్గానికి చెందిన వారు తాడోపేడో తేల్చుకునేందుకు హైదరాబాద్ శామీర్ పేట్ లోని ఈటల నివాసానికి పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. బీజేపీలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదని, బండి సంజయ్ వర్గం తమను అవమానాలకు గురి చేస్తోందంటూ.. వారు ఈటల సమక్షంలో తమ ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తమకు బండి వర్గం టికెట్లు ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు కూడా ఈటల వర్గంలో బలంగా నెలకోన్నాయి. ఈ సందర్బంగా కార్యకర్తల మనోభావాలను విన్న ఈటల కూడా ఒక్కసారిగా ఆవేశానికి గురై తాడోపేడో అన్నట్లుగా మాట్లాడారు. కొంతమంది శామీర్పేట గ్రూపు అంటూ ప్రచారం చేస్తున్నారని, తాను రెండుసార్లు మంత్రిగా, రెండుసార్లు బిఆర్ఎస్ లో జిల్లా అధ్యక్షునిగా పనిచేశానని, కరీంనగర్ లో తాను అడుగుపెట్టని గ్రామం అంటూ లేదని ఆవేశంగా అన్నారు. తనపై విమర్శలు చేస్తున్నారంటూ… పరోక్షంగా బండి సంజయ్ వర్గంపై మండిపడ్డారు. కాగా బిజెపి జిల్లా అధ్యక్షునిగా ఉన్న గంగాడి కృష్ణారెడ్డి కూడా హుజురాబాద్ నియోజకవర్గం వీణవంక మండలానికి చెందినవాడు కావడం గమనార్హం. ఈ గ్రూపులపోరు అయన సొంత మండలంలో కూడా ఉండడం విశేషం. ఇదిలా ఉంటే.. తాను ఈ విషయాన్ని అధిష్టానం వద్దే తేల్చుకుంటానంటూ.. ఈటల శామీర్పేట లోని తన నివాసం వద్ద ప్రకటించారు.

బిజెపిలో ఏం జరుగుతుందో?

హుజురాబాద్ బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై ఈటల రాజేందర్ తో పాటు అయన వర్గం సీరియస్ గా ఉన్నారు. ఈ విషయాలను అయన అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉంది. బండి వర్గం తమకు వ్యతిరేకంగా పనిచేస్తున్న అంశాన్ని కేంద్ర స్థాయిలో అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లారా? లేక.. రాష్ట్ర స్థాయిలో కిషన్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు దృష్టికి తీసుకువెళ్తారా? ఈ వ్యవహారంలో బండి వర్గం ఏమైనా తగ్గుతుందా? లేక సై అంటే.. సై అని అంటుందా? అధిష్ఠానం ఈ అంశంలో ఏవిధంగా వ్యవహరిస్తుంది? అన్నది స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎవరు మాట్లాడిన క్రమశిక్షణ చర్యలు అంటూ అధిష్టానం హెచ్చరిక!

అయితే ఈటెల రాజేందర్ – బండి సంజయ్ ల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలి వానగా మారడంతో అధిష్టానం ఈ విషయమును సీరియస్ గా తీసుకుంది. పార్టీకి సంబంధించిన నాయకులు గానీ కార్యకర్తలు గాని ఎవరు నోరు మెదిపిన తక్షణమే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి రావడంతో శనివారం ఈటల అన్న దానికి బండి ఆఖరుగణం ఏ విధంగా స్పందిస్తారో లేధో వేసి చూడాల్సి ఉండగా, ఈ గొడవ మరింత రాష్ట్రంలో రక్తిని కట్టే అవకాశం ఉన్నట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!