26-08-2025 NORMAL NEWS 11:45 PM
swarnodayam.com
Telugu Daily News
26-08-2025 11:45 PM By Mandala Yadagiri

ఆగమ శాస్త్రము ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు.. – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

ఆగమ శాస్త్రము ప్రకారం ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు.. – ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
IMG-20250826-WA0096

మహా మండపం పరిధిలోని ప్రధాన ఆలయ అభివృద్ధి పనులు ప్రాధాన్యతతో పూర్తి చేస్తాం

ఆలయ పునర్నిర్మాణ సమయంలో నిరంతరాయంగా స్వామి వారికి కొనసాగనున్న కైంకర్య సేవలు

రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ ను వివరిస్తూ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్


స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (వేములవాడ), ఆగస్టు-26: ఆగమ శాస్త్ర ఆధారంగా ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.మంగళవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ ప్రాంగణం ఓపెన్ స్లాబ్ హల్ నందు రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ ను వివరిస్తూ నిర్వహించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లతో కలిసి పాల్గొన్నారు.

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్కిటెక్చర్ (వాస్తు శిల్పి) సూర్య నారాయణ మూర్తి వివరించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి ప్రణాళికను భక్తులకు, ప్రముఖులకు పారదర్శకంగా తెలియజేయడం జరిగిందని అన్నారు. రాబోయే రోజులలో పెరిగే భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి ప్రణాళికలను డీ.జీ.పీ.ఎస్, డ్రోన్ సర్వే ఆధారంగా తయారు చేశామని తెలిపారు. మహా శివరాత్రి, సమ్మక్క సారలమ్మ జాతర వంటి సమయాల్లో పార్కింగ్ సమస్య ఉత్పన్నం కాకుండా జగిత్యాల రోడ్డు వైపు 20 ఎకరాలు ముందుగానే గుర్తించి పెట్టామని అన్నారు.

చారిత్రాత్మక ప్రాధాన్యత, పౌరాణిక ప్రాధాన్యత ఉన్న ఉప ఆలయాలు యధావిధిగా కొనసాగుతాయని, ఆలయ విస్తరణ అభివృద్ధి పనులను ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టడం జరుగుతుందని, శృంగేరి పీఠం అనుమతి తో ఎటువంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్రణాళిక తయారు చేశామని అన్నారు. రాజన్న ఆలయం ముందు రావి చెట్టు, నాగిరెడ్డి మండపం, దక్షిణామూర్తి, సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, రాజ గొపురం యధావిధిగా కొనసాగుతూ చుట్టు మహా మండప నిర్మాణం ఉంటుందని, కోటిలింగాల మండపం పూర్తి స్థాయిలో పునర్నిర్మిస్తామని, అక్కడ వీరభద్రుడు యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు.

ఆలయ విస్తరణ 4.6 ఎకరాలలో ఉంటుందని, మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ఏరియా 33 ఎకరాల వరకు ఉంటుందని అన్నారు. ఆలయ విస్తరణలో షాపులు కోల్పోయే వారికి భవిష్యత్తులో కేటాయించేందుకు హరిహర షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశామని, ఇటీవల ఆలయ రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయని అన్నారు. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి 110 కోట్ల కు టెండర్లు పిలిచామని , వీటిలో ఆలయ విస్తరణకు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత కింద 76 కోట్లు, అన్నదాన సత్రం నిర్మాణానికి 35 కోట్లు కేటాయించడం జరిగిందని, 2025-26 ఆర్థిక సంవత్సరంలో రొండవ విడత కింద 285 కోట్లు కేటాయించడం జరుగుతుందని అన్నారు. ఆలయంలో శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి కైంకర్య సేవలు, ఏకాంత, ఇతర సేవలు యధావిధిగా నిరంతరాయంగా కొనసాగుతాయని , మహా మండపం నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కుంభాభిషకం చేసి త్వరగా స్వామి దర్శనం భక్తులకు కలిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు జరిగే సమయంలో వేములవాడ క్షేత్రంలో భీమేశ్వర ఆలయంలో భక్తులకు దర్శనం ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అన్నారు.ఆలయ విస్తరణలో భాగంగా 30 మంది మీడియా మిత్రులు కూర్చునే విధంగా మీడియా పాయింట్, 6 పడకల ఆసుపత్రి ఉండేలా చూడాలని ప్రభుత్వ విప్ వాస్తు శిల్పి కు సూచించారు. ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ మాట్లాడుతూ, ఆలయ పునర్నిర్మాణం ప్రణాళికను తెలియజేస్తూ, ప్రజలకు ఉన్న సందేహాలు అపోహలను తొలగించేందుకు చర్యలు చేపట్టామని అన్నారు.ఆగమ శాస్త్రం ప్రకారం అభివృద్ధి ప్రణాళిక తయారు చేశామని అన్నారు. వేములవాడ ఆలయ నిర్మాణాలు వాస్తు ప్రకారం చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఆలయ రొడ్డు విస్తరణ భూ సేకరణ పూర్తి చేశామని అన్నారు. ఆలయ అభివృద్ధి కోసం మరో 36 గుంటల సేకరణకు చర్యలు చేపడతామని అన్నారు. సమావేశానంతరం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ వెంకటరావు, దేవదాయ శాఖ సలహాదారు గోవింద్ హరి, ఆలయ ఇన్చార్జి ఈ.ఓ.రాధాబాయి, వివిధ పార్టీల నాయకులు పుర ప్రముఖులు ప్రజలు పురోహితులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గోన్నారు.


Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!