22-11-2025 NORMAL NEWS 08:12 PM
swarnodayam.com
Telugu Daily News
22-11-2025 08:12 PM By Mandala Yadagiri

విద్యార్థులకు ‘జయన్న ఫౌండేషన్’ చేయూత: – కందుగుల పాఠశాలలకు లక్ష రూపాయల మౌలిక వసతులు కల్పించిన జయన్న ఫౌండేషన్.

విద్యార్థులకు ‘జయన్న ఫౌండేషన్’ చేయూత: – కందుగుల పాఠశాలలకు లక్ష రూపాయల మౌలిక వసతులు కల్పించిన జయన్న ఫౌండేషన్.
IMG-20251122-WA0096

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలోని ఉన్నత పాఠశాల (జడ్.పి.హెచ్.ఎస్) మరియు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ‘జయన్న ఫౌండేషన్’ లక్ష రూపాయల వ్యయంతో విశేష సహాయాన్ని అందించింది. పాఠశాలల్లో అత్యవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపరిచారు. ఫౌండేషన్ తమ ఉదారతను మరోసారి చాటుకున్నారు..
తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం:
పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా ఫౌండేషన్ చర్యలు చేపట్టింది. ఇందుకోసం కొత్తగా మోటారు, పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాక, మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు కింద స్థాయి నుండి పై ట్యాంకుకు చేరడానికి అవసరమైన మోటారు, పైప్‌లైన్ సౌకర్యాన్ని కల్పించారు. అలాగే, మరుగుదొడ్లలో (బాత్రూమ్‌లలో) కొత్త నల్లా (ట్యాప్) కనెక్షన్లు ఇచ్చి, అవసరమైన మరమ్మతులను కూడా పూర్తి చేయించారు.
విద్యార్థులకు వస్తు సామగ్రి, బాలికలకు ప్రత్యేక కిట్లు:
మౌలిక వసతులతో పాటు, విద్యార్థుల దైనందిన అవసరాల కోసం ఫౌండేషన్ ప్లేట్లు, గ్లాసులను బహూకరించింది. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రత్యేకంగా ప్లేట్లు, కొత్త పలకలను కూడా అందించారు. ముఖ్యంగా, పాఠశాలలో 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న బాలికల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని వారికి శానిటరీ నాప్‌కిన్స్ కిట్‌లను పంపిణీ చేశారు.
🙏 సేవలో నిరంతరాయంగా: గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి:
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘జయన్న ఫౌండేషన్’ ఛైర్మన్ గుడిపాటి సరిత- జైపాల్ రెడ్డి తమ సేవా దృక్పథాన్ని వివరించారు. విద్య, ఆరోగ్య అభివృద్ధికి తమ వంతు సహాయాన్ని నిరంతరం అందిస్తామని స్పష్టం చేశారు. పాఠశాల పిల్లలకు సౌకర్యాలు కల్పించడం తమకు ఎంతో ఆనందాన్ని, “బిరియాని తిన్నంత” సంతోషాన్ని ఇచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.
వైద్య సహాయంపై ప్రత్యేక శ్రద్ధ:
తమ గత సేవా కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ, గతంలో మండలంలోని సుమారు 1500 మంది గ్రామ ప్రజలకు హైదరాబాద్‌లోని శంకర కంటి వైద్యశాల ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు చేయించి, ఆపరేషన్లు నిర్వహించి లెన్సులు అమర్చినట్లు జైపాల్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో కూడా గాంధీ వైద్యశాల వంటి చోట్ల ఎలాంటి వైద్య సహాయం అవసరమైనా తమ సొంత ఖర్చులతో చేయించడానికి సిద్ధంగా ఉన్నానని హామీ ఇచ్చారు. సింగపూర్ గ్రామ ప్రజల కోసం ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేసినట్లు, ప్రమాదాలు జరిగినప్పుడు హుటాహుటిన హైదరాబాద్ వరకు తరలించే సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ ఆరోగ్య సమస్యలను తెలియజేస్తే, వెంటనే స్పందించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు కాసం రఘుపతి రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ బెల్లి రాజయ్య, కాంగ్రెస్ ఎస్సీ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడి దయాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Oplus_16908288

జయన్న ఫౌండేషన్ నిర్వహకులను సన్మానిస్తున్న పాఠశాల నిర్వాహకులు..

మాట్లాడుతున్న ఫౌండేషన్ నిర్వాహకుడు జైపాల్ రెడ్డి..

హాజరైన విద్యార్థులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!