Social 1080×1350 • Multi-page
17-01-2026 BREAKING NEWS 04:51 PM
swarnodayam.com
Telugu Daily News

తెలంగాణ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ టీచర్స్ యూనియన్ 2026 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
Oplus_16908288

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణ టీచర్స్ యూనియన్ 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం హుజురాబాద్ మండలం బోర్నపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్రె చిరంజీవి, ఉపాధ్యాయుల చేతుల మీదుగా క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, విద్యారంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ సంఘం పక్షాన నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికీ ఉపాధ్యాయులకు సంబంధించిన నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉండటం దురదృష్టకరమని, రెండున్నర సంవత్సరాల కాలం గడిచినప్పటికీ పీఆర్సీ అమలుపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన లేకపోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే పీఆర్సీ నివేదికను తెప్పించుకొని, పీఆర్సీ ప్రకటన చేసి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టీచర్ పర్ఫామెన్స్ గ్రేడింగ్ అమలు చేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలు ఎక్కువగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన వారని, అలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయులపై అదనపు ఒత్తిడి తీసుకువచ్చే విధానాలు సరికాదని అన్నారు.
ప్రభుత్వ విద్య బలోపేతమే లక్ష్యంగా, ఉపాధ్యాయుల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ టీచర్స్ యూనియన్ భవిష్యత్తులోనూ ఉద్యమ బాటలో ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

తెలంగాణ టీచర్స్ యూనియన్ 2026 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ఆవిష్కరీస్తున్న యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోలంపెల్లి ఆదర్శన్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్రె చిరంజీవి, ఉపాధ్యాయులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!