29-01-2026 NORMAL NEWS 06:58 PM
swarnodayam.com
Telugu Daily News
29-01-2026 06:58 PM By Mandala Yadagiri

హుజూరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. సమ్మక్క దర్శనానికి వెళ్లకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబం అడ్డగింత.. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.

హుజూరాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత.. సమ్మక్క దర్శనానికి వెళ్లకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కుటుంబం అడ్డగింత.. రోడ్డుపై బైటాయించి నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే.
IMG_20260129_185431

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్ : హుజురాబాద్
నియోజకవర్గ కేంద్రంలో గురువారం సాయంత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే స్వగ్రామం వీణవంకలోని మేడారం శ్రీ సమ్మక్క-సారలమ్మ దర్శనానికి వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబాన్ని పోలీసులు అప్రజాస్వామికంగా తన క్యాంపు కార్యాలయం సమీపంలో కరీంనగర్ వరంగల్ ప్రధాన రహదారిపై అడ్డుకోవడం స్థానికంగా పెను దుమారం రేపింది. వీణవంక మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరకు తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం బయలుదేరిన ఎమ్మెల్యేను, ఆయన క్యాంపు కార్యాలయం (కేసీ క్యాంప్) వద్దే పోలీసులు భారీ బందోబస్తుతో నిలిపివేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఉన్న స్థానిక(వీణవంక) దళిత మహిళా సర్పంచ్ దాసరపు సరోజనను సైతం పోలీసులు అడ్డుకోవడంతో, ఇది దళిత ప్రజాప్రతినిధిని ఘోరంగా అవమానించడమేనని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
కరీంనగర్ సీపీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. భక్తిభావంతో మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్తున్న తనను మరియు తన కుటుంబ సభ్యులను ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీసులను నిలదీశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ -హన్మకొండ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో పోలీసులకు, నిరసనకారులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. పోలీసుల అత్యుత్సాహం నశించాలంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధికి కనీసం జాతరకు వెళ్లే స్వేచ్ఛ కూడా లేదా అని ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్షాలను వేధిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. శాంతిభద్రతల పేరుతో భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్న జిల్లా సిపినీ వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేము అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కరి సంగతి చూస్తామంటూ పోలీసులకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే నిరసనతో ప్రధాన రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ, ఎమ్మెల్యే పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు, పోలీసుల పట్ల ఎమ్మెల్యే దురుసు ప్రవర్తన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక మహిళా దళిత సర్పంచ్‌ను జాతరకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రభుత్వ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతసేపటి తర్వాత పరిస్థితి చల్లబడడంతో ఎక్కడి వారు అక్కడకు వెళ్లిపోయారు.

పోలీస్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..

కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సభ్యులతో సహా నాయకులు, కార్యకర్తలతో కలిసి బైటాయించిన దృశ్యాలు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!