Social 1080×1350 • Multi-page
07-03-2026 BREAKING NEWS 06:59 AM
swarnodayam.com
Telugu Daily News

గురుకులంలో కలకలం: ఉపాధ్యాయుల వేధింపులకు విద్యార్థి అదృశ్యం?తల్లిదండ్రులపై అనుచిత వ్యాఖ్యలు..- అర్ధరాత్రి డార్మిటరీలో గొడవ.. – ఆపై గల్లంతు

గురుకులంలో కలకలం: ఉపాధ్యాయుల వేధింపులకు విద్యార్థి అదృశ్యం?తల్లిదండ్రులపై  అనుచిత వ్యాఖ్యలు..- అర్ధరాత్రి డార్మిటరీలో గొడవ.. – ఆపై గల్లంతు
IMG_20260307_055757

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలంలోని బోర్నపల్లి శివారులో గల మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (వీణవంక)లో పదవ తరగతి విద్యార్థి ఇమ్మడి శశాంక్ అదృశ్యం కావడం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, విద్యార్థి తల్లిదండ్రుల పట్ల వారు చేసిన అవమానకర వ్యాఖ్యలే ఈ ఘటనకు ప్రధాన కారణమని విద్యార్థి సంఘాలు మరియు తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
కందుగుల గ్రామానికి చెందిన బాబయ్య కుమారుడు శశాంక్ (16) పదవ తరగతి చదువుతున్నాడు. తండ్రి హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గురువారం సాయంత్రం కంటి చికిత్స నిమిత్తం తల్లిదండ్రులతో కలిసి ఆస్పత్రికి వెళ్లిన శశాంక్, రాత్రి తిరిగి హాస్టల్‌కు చేరుకున్నాడు.
అవమానం.. ఆపై ఆగ్రహం.
రాత్రి స్టడీ అవర్ సమయంలో గణిత ఉపాధ్యాయుడు శ్రీనివాస్, మరో ఉపాధ్యాయురాలు షబీరాతో ఫోన్లో లౌడ్ స్పీకర్‌లో మాట్లాడుతుండగా.. షబీరా మేడమ్ శశాంక్ తండ్రి వృత్తిని, అలవాట్లను కించపరుస్తూ “వాడి డాడీ తాగుతాడు.. వీళ్లంతా గిట్లనే తిరుగుతారు” అని అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తమ తల్లిదండ్రులను దూషించవద్దని, లౌడ్ స్పీకర్ ఆపివేయాలని విద్యార్థులు కోరడంతో ఆగ్రహానికి గురైన శ్రీనివాస్ టీచర్.. “నాకే చెబుతారా? అఫ్ట్రాల్ గాళ్లు” అంటూ విద్యార్థులపై విరుచుకుపడ్డారు.
డార్మిటరీలో ఉద్రిక్తత – అర్ధరాత్రి గందరగోళం.
రాత్రి 11 గంటల సమయంలో శ్రీనివాస్ టీచర్ డార్మిటరీకి వెళ్లి శశాంక్‌తో మళ్లీ గొడవ పడ్డారు. టీచర్ ప్రవర్తనను శశాంక్ తన మొబైల్‌లో రికార్డు చేసేందుకు ప్రయత్నించగా, టీచర్ ఆ ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నట్లు తోటి విద్యార్థులు సాక్ష్యమిస్తున్నారు. అనంతరం రాత్రి 11:30 గంటలకు శశాంక్ తల్లిదండ్రులకు ఫోన్ చేసిన టీచర్, ఇప్పుడే వచ్చి మీ పిల్లాడిని తీసుకెళ్లాలని ఒత్తిడి చేశారు. అంత రాత్రి వేళ రాలేమని, ఉదయం వస్తామని వారు బదులిచ్చారు. అయితే, తెల్లవారుజామున 5 గంటల సమయంలో శశాంక్ బెడ్‌పై కనిపించకపోవడంతో హాస్టల్‌లో కలకలం రేగింది.
రోడ్డుపై నిరసన – పోలీసుల దర్యాప్తు.
విద్యార్థి గల్లంతైన విషయాన్ని దాచిపెట్టిన పాఠశాల సిబ్బంది, ఉదయం 7:30 గంటలకు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ప్రిన్సిపాల్ సంపత్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ, శశాంక్ తల్లిదండ్రులు మరియు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు.
“ఒక పేద కుటుంబానికి చెందిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయులు ఇంత క్రూరంగా ప్రవర్తించడం అమానుషం. బాధ్యులైన శ్రీనివాస్ మరియు షబీరా టీచర్లపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి” అని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. టీచర్ల వేధింపుల వల్లే శశాంక్ భయంతో పారిపోయాడా లేక మరేదైనా అపశృతి జరిగిందా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

కనిపించకుండా పోయిన శశాంక్

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల (వీణవంక)

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!