Social 1080×1350 • Multi-page
06-04-2026 BREAKING NEWS 11:57 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్ లో డంప్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలని కలెక్టర్ కు అఖిల పక్షం వినతి.

హుజూరాబాద్ లో డంప్ యార్డ్ ఏర్పాటును రద్దు చేయాలని కలెక్టర్ కు అఖిల పక్షం వినతి.
IMG-20260406-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:

-హుజూరాబాద్ మండలంలోని సిర్సపల్లి -కొత్తపల్లి గ్రామాల సమీపంలో ప్రభుత్వం ప్రతిపాదించిన (వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్) డంప్ యార్డ్ ఏర్పాటును తక్షణమే రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ కు అఖిల పక్షం నాయకులు వినతి అందజేశారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని కమిటీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.

విత్తనోత్పత్తికి గండం..

తెలంగాణలోనే ‘సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా’గా పేరుగాంచిన హుజూరాబాద్ ప్రాంతం నుంచి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ వంటి అనేక రాష్ట్రాలకు వరి విత్తనాలు ఎగుమతి అవుతున్నాయని నాయకులు గుర్తు చేశారు. ప్లాంట్ ఏర్పాటు వల్ల విత్తనోత్పత్తి దెబ్బతిని రైతులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గాలి, నీరు కలుషితం. కావడమే కాకుండా, సమీపంలోని గుట్టల్లో నివసించే వందలాది నెమళ్లు, వన్యప్రాణుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని వినతిపత్రంలో పేర్కొన్నారు.

దినదినం పెరుగుతున్న నిరసన కార్యక్రమాలు

గత 15 రోజులుగా హుజూరాబాద్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేలాది మంది ప్రజలు నిరసన దీక్షలు చేపడుతున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రజల మనోభావాలను గౌరవించి ప్రాజెక్టును తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్లాంట్ కు వ్యతిరేకంగా హుజూరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ తో పాటు మండలంలోని 18 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా తీర్మానాలు చేసినట్లు కమిటీ నేతలు వెల్లడించారు. “ప్రజల ఆరోగ్యాన్ని, పచ్చని పంట పొలాలను బలిపెట్టి చేసే ఇటువంటి ప్రాజెక్టులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమనీ, ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు పి. ఈశ్వర్ రెడ్డి, పోల్సాని రామ్మోహన్ రావు, వేల్పుల రత్నం, వెంకట్రావు, కొలిపాక సమ్మయ్యలు వెల్లడించారు. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ప్లాంట్ ఏర్పాటు చేస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు కలెక్టర్ కు స్పష్టం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!