Social 1080×1350 • Multi-page
19-04-2026 BREAKING NEWS 07:56 PM
swarnodayam.com
Telugu Daily News

ప్రజలను ఏకం చేసి పోరాటం చేస్తా..డంప్ యార్డ్ ఏర్పాటుతో దేవాలయ పవిత్రతకు భంగం. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

ప్రజలను ఏకం చేసి పోరాటం చేస్తా..డంప్ యార్డ్ ఏర్పాటుతో దేవాలయ పవిత్రతకు భంగం. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
IMG-20260419-WA0144

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే, పర్యావరణాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ఏర్పాటును ఒప్పుకోనని, 9 మండలాల ప్రజలను ఏకం చేసి పోరాటం చేస్తానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆదివారం హుజురాబాద్ మండలం సిరిసపల్లి గ్రామ శివారులో ఐలోని బోటి గుట్ట వద్ద వెలసిన స్వయంభు ఐలోని మల్లన్న దేవాలయం వద్ద జరిగిన జాతరకు ఆయన హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు పనిచేయాలని, ప్రజారోగ్యానికి నష్టం కలిగించే పనులు ఏ ప్రభుత్వం కూడా చేపట్టరాదన్నారు. గత 28 రోజులుగా హుజురాబాద్ ప్రజలు మాకు డంపింగ్ యార్డ్ వద్దు మొర్రో అని నిరసనలు తెలుపుతున్న ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతంలో పచ్చని పంట పొలాలుగా ఉన్న భూములన్ని బీడు వారుతాయని, ప్రజలు రోగాల బారిన పడతారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ ల చెత్తతో పాటు తొమ్మిది మున్సిపాలిటీల చెత్తను హుజురాబాద్ కు పంపించి హుజురాబాద్ లో చెత్త నరక కూపంగా తయారు చేయడానికి ప్రభుత్వం ఎందుకు ముందుకు వస్తుందని అన్నారు. అసెంబ్లీలో డంపింగ్ యార్డ్ పై తాను ప్రభుత్వానికి విన్నవించాలని, సిఎస్ రామకృష్ణారావుకు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్ కు ఇతర అధికారులకు విన్నవించానని ఆయన అన్నారు. ప్రజల బాగోగులు పట్టించుకోవాల్సిన ప్రభుత్వం కాంట్రాక్టర్లకు లాభం కలిగించే పనులు ఎందుకు చేస్తున్నారని అన్నారు. 9 మండలాల ప్రజలను ఏకం చేసి పోరాటం చేస్తానని అన్నారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తానని ఆయన హెచ్చరించారు. సిరిసపల్లి గుట్ట సమీపంలో మల్లన్న దేవాలయం ఉందని, అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టడం వల్ల మల్లన్న పవిత్రత కు నష్టం వాటిల్లుతుందని, మల్లన్న దేవుని పవిత్రతను కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రభుత్వానికి ప్రజలపై ప్రేమ లేదు. దేవుడిపై కూడా భయం లేదని ఆయన అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం సరికాదు. డంపింగ్ యార్డ్ వల్ల చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు దుర్వాసన, కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు పంట భూములు దెబ్బతిని రైతులకు తీవ్ర నష్టం జరుగుతుంది అని అన్నారు . ప్రభుత్వం డంపింగ్ యార్డ్ విషయంలో నిర్ణయాన్ని పునరాలోచించాలని వెంటనే డంపింగ్ యార్డ్ ను రద్దు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ వి రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్ లు పి రామారావు, కట్కూరు మల్లారెడ్డి, నాయకులు ఎడవల్లి కొండల్ రెడ్డి, ఎడ్ల విజయకుమార్, జనగాం రాజేశ్వరరావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!