Social 1080×1350 • Multi-page
02-05-2026 BREAKING NEWS 07:43 PM
swarnodayam.com
Telugu Daily News

సర్కారీ చదువులకు ‘జయన్న’ భరోసా.. – ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించిన జయన్న ఫౌండేషన్..

సర్కారీ చదువులకు ‘జయన్న’ భరోసా.. – ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతను అందించిన జయన్న ఫౌండేషన్..
IMG-20260502-WA0105

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 2: “నేను నడిచి వెళ్లాను.. నా పిల్లలు నడవకూడదు. నేను ప్యాడ్ లేకుండా ఎగ్జామ్ రాశాను.. నా ఊరి పిల్లలకు ఆ కష్టం రాకూడదు” అనే సంకల్పంతో హుజురాబాద్ మండలంలో జయన్న ఫౌండేషన్ చేస్తున్న కృషి అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి, ప్రైవేటు స్కూళ్లను తలదన్నేలా 571 మార్కులతో సత్తా చాటిన విద్యార్థులను శనివారం జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ సమక్షంలో ప్రతిభావంతులకు నగదు బహుమతులు, జ్ఞాపికలను అందజేశారు. అల్పాహారం నుంచి ఆటో ఛార్జీల వరకు..కేవలం ఫలితాల తర్వాతే కాకుండా, పరీక్షల సమయంలోనూ విద్యార్థులు ఖాళీ కడుపుతో వెళ్లకూడదనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి రూ. 700 నగదు సహాయం అందించిన ఫౌండేషన్ చైర్మన్ జైపాల్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. తాజాగా జరిగిన కార్యక్రమంలో 13 ప్రభుత్వ స్కూళ్లకు చెందిన 35 మంది విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా నగదు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా గుడిపాటి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్య అనేది ఒక ఇంటికి వెలుగునిస్తుందని, ఆస్తుల కంటే పిల్లలకు చదువునివ్వడమే గొప్ప సంపద అని పేర్కొన్నారు. సర్కారీ స్కూళ్లకు కొత్త హంగులు విద్యార్థులకే కాకుండా స్కూళ్ల అభివృద్ధికి కూడా ఫౌండేషన్ భారీ హామీలు ఇచ్చిందన్నారు. ఈ వేసవి సెలవుల్లోగా మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల మరమ్మతులు, ఫ్యాన్లు, ఫర్నిచర్ వంటి సౌకర్యాలు కల్పిస్తామని చైర్మన్ జయన్న ప్రకటించారు. అంతేకాకుండా, వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినులకు ఏడాదికి సరిపడా శానిటరీ ప్యాడ్లను ఉచితంగా అందజేస్తామని చెప్పడం విశేషం. ఈ కార్యక్రమంలో గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొని ఫౌండేషన్ సేవలను కొనియాడారు. ఏడాది ఏడాదికి ఫౌండేషన్ సేవలను పెద్ద ఎత్తున విస్తరించి పేద విద్యార్థులకు అండగా నిలవడం నిజంగా ఎంతో అభినందనీయమని తల్లిదండ్రులు పేర్కొన్నారు.

ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలను జ్ఞాపికలు, నగదుతో సత్కరిస్తున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు, ఎంఈఓ..

జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగదు పురస్కారాలు అందజేసి విద్యార్థినులతో ఫౌండేషన్ నిర్వాహకులు గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి, ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు..

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!