Social 1080×1350 • Multi-page
02-05-2026 BREAKING NEWS 08:04 PM
swarnodayam.com
Telugu Daily News

అన్నదాతల గోడు పట్టించుకునే నాథుడే లేడా? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? – రైతు జేఏసీ నిలదీత

అన్నదాతల గోడు పట్టించుకునే నాథుడే లేడా? కొనుగోలు కేంద్రాల్లో నిలువు దోపిడీ.. ప్రజాప్రతినిధులు ఎక్కడ? – రైతు జేఏసీ నిలదీత
IMG-20260502-WA0113

—ఆరుగాలం పండించిన రైతుకు అరిగోస:

—రైతుల సూచనల మేరకే ఈ నెల 30 న కరీంనగర్ లో లక్షలాది మంది తో రైతుల మహాగర్జన సమర భేరి సభ. పోలాడి వెల్లడి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(హైదరాబాద్): చెమటను చిందించి, కడుపు కట్టుకుని ఆరుగాలం కష్టపడి పంట పండించిన అన్నదాతకు అమ్ముకునే సమయంలో అరిగోస తప్పడం లేదు. మట్టిని నమ్మి పంట పండిస్తే, తీరా విక్రయించే సమయానికి ప్రభుత్వం నుంచి కనీస సహకారం అందక రైతులు కన్నీరు పెడుతున్నారు. “రైతుల గోడు పట్టించుకునే నాదుడే లేడా? రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడున్నారు?” అంటూ రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్ర స్థాయిలో నిలదీశారు.

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు

శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ఆర్భాటంగా ప్రారంభించి పది రోజులు దాటుతున్నా, కొనుగోళ్లు మాత్రం జరగడం లేదని విమర్శించారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు పగలు, రాత్రి ధాన్యం కుప్పల వద్ద కాపలా కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం టార్పాలిన్ షీట్లు, గన్నీ బ్యాగులు కూడా సరఫరా చేయకపోవడంతో దళారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్ల మాయాజాలం – తూకాల్లో నిలువు దోపిడీధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు, అధికారులు కుమ్మక్కై రైతులను దగా చేస్తున్నారని నాయకులు ధ్వజమెత్తారు. ఏ-గ్రేడ్ ధాన్యానికి రూ. 2389 మద్దతు ధర ఇవ్వాల్సి ఉండగా, సాధారణ రకం ధర అయిన రూ. 2369 ఇస్తేనే దింపుకుంటామని మిల్లర్లు బెదిరిస్తున్నారని మండిపడ్డారు. తూకం సమయంలో క్వింటాల్‌కు 5 కిలోల అదనపు ధాన్యాన్ని తీసుకోవడమే కాకుండా, మిల్లుల వద్ద బస్తాకు మరో రెండు కిలోల చొప్పున ‘తరుగు’ పేరుతో కట్ చేస్తున్నారని, క్వింటాల్‌కు రూ. 20 చొప్పున తక్కువగా చెల్లిస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న రకాలకు ఇస్తామన్న రూ. 500 బోనస్‌ను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొనుగోళ్లలో ఆలస్యం చేస్తోందని, రైతు భరోసా నిధులను కూడా సాగు సమయంలో ఇవ్వకుండా ఇప్పుడు అరకొరగా విడతల వారీగా ఇవ్వడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహా గర్జన’ పాలకుల నిర్లక్ష్యానికి నిరసనగా మే 30న కరీంనగర్‌లో ‘రైతు మహాగర్జన’ పేరుతో భారీ సమర భేరి మోగిస్తామని పోలాడి రామారావు వెల్లడించారు. వరి కోతలు పూర్తికాకపోవడం, విద్యార్థుల విన్నపం మేరకు సభ తేదీని మార్చినట్లు తెలిపారు. మే 30న రెండు లక్షల మంది రైతులతో పార్టీలకతీతంగా ఈ సభను నిర్వహిస్తామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సన్న వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని, పొద్దుతిరుగుడు, శనగ, మొక్కజొన్న రైతులకు కూడా మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జేఏసీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంధి తిరుపతిరెడ్డి, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు పెండ్యాల రాంరెడ్డి, సలహాదారు పెండ్యాల కేశవరెడ్డి, నాయకులు చెన్నమనేని పురుషోత్తం రావు, అయిత నాగరాజు, జున్నుతుల రాజిరెడ్డి, చొక్కారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అభివాదం చేస్తున్న రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, జాతీయ, రాష్ట్ర నాయకులు

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!