Social 1080×1350 • Multi-page
03-05-2026 BREAKING NEWS 09:19 PM
swarnodayam.com
Telugu Daily News

మంత్రుల హామీతో డంపింగ్ యార్డ్ నిరసన దీక్షల విరమణ. – ప్రభుత్వం నుండి ప్రకటన ఇప్పిస్తా. – కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు

మంత్రుల హామీతో డంపింగ్ యార్డ్ నిరసన దీక్షల విరమణ.  – ప్రభుత్వం నుండి ప్రకటన ఇప్పిస్తా.  – కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు
IMG-20260503-WA0131

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరిసర ప్రాంతంలోని సిర్సపల్లిలో ప్రభుత్వ ప్రతిపాదిత వేస్ట్ టు ఎనర్జీ డంపింగ్ యార్డ్ ప్రాజెక్టును రద్దు చేయాలని కోరుతూ గత 42 రోజులుగా జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన దీక్షలు రాష్ట్ర మంత్రులు ఇచ్చిన హామీ మేరకు ఆదివారం విరమించారు. ఈ సందర్భంగా నిరసన దీక్ష శిబిరంకు హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు జేఏసీ నాయకులతో మాట్లాడి దీక్షలను విరమింప చేశారు.

ఈ సందర్భంగా ప్రణవ్ బాబు మాట్లాడుతూ….వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ పై ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలేదని, ప్రజలు 42 రోజులుగా ఈ ప్రాజెక్టు వద్దని చేస్తున్న నిరసన దీక్షలకు మంత్రులు సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ ప్రాంత ప్రజలు ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాలకు భయ పడుతుండడంతో హుజురాబాద్ బిడ్డగా ఈ ప్రాంతానికి పదవి ఉన్నా లేకపోయినా నిరంతరం సేవ చేస్తానని ఆయన అన్నారు. దీక్ష మొదలైన రెండో రెండో రోజే ప్రభుత్వం నుండి హామీ ఇప్పిస్తానని చెప్పానని దాని ప్రకారం మంత్రులు హామీ ఇచ్చారని అన్నారు. ప్రభుత్వoకు, ప్రజలకు మధ్య వారధిగా తాను ప్రజల కష్టాల్లో తోడుంటాననీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రోంటాల సుహాసిని, పలువురు కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు, జువెల్లరీ షాపుల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం జరుగుతున్న ఉద్యమాన్ని విరమించడం లేదు…విరామం మాత్రమే. – అఖిలపక్ష కమిటీ

హుజూరాబాద్ ప్రాంత ప్రజలకు ప్రాణాంతకంగా మారనున్న సిర్సపల్లి వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని విరమించడంలేదని, ఉద్యమానికి తాత్కాలిక విరామం మాత్రమే ఇవ్వడం జరిగిందని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పల్కల ఈశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్లాంట్ రద్దు కోసం గత నలభై రెండు రోజులుగా అన్ని వర్గాల ప్రజలు అఖిలపక్షం ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఉద్యమించడమే కాకుండా, అంబేద్కర్ కూడలి వద్ద జరిగిన నిరవధిక నిరసనలో పాల్గొన్న తీరు చారిత్రాత్మకమైనది. నలభై రెండు రోజుల ప్రజా ఉద్యమానికి స్పందించిన ప్రభుత్వం తమ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వంలో కీలకపాత్రను నిర్వహిస్తున్న సీనియర్ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో వెస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ రద్దు కోసం ఉద్యమిస్తున్న అఖిలపక్ష కమిటీ సభ్యులతో దాదాపు గంట సేపు విస్తృత చర్చలు జరిపారు. మంత్రితో జరిగిన చర్చల్లో అఖిలపక్ష కమిటీ బాధ్యులతో పాటు కాంగ్రెస్, బిఆర్.ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజా సంఘాల బాధ్యులు దాదాపు యాభై మంది పాల్గొన్నారు. ఈ విస్తృత చర్చల్లో మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుందని, అందులో భాగంగానే సిరసపల్లి వద్ద ప్రతిపాదించిన ప్లాంట్ ఏర్పాటు విషయంలో ముందుకుపోకుండా, సహచర మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వమే ఒక అడుగు ముందుకు వేసి, సమస్యను పరిష్కరించేందుకు ముందుకు రావడంతో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్యమానికి తాత్కాలికంగా విరామం ప్రకటిస్తున్నాం. ప్రభుత్వం సరైన సమయంలో ప్లాంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించకపోతే,ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ, తిరిగి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ఈశ్వర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఈ మేరకు చర్యలను ప్రారంభిస్తుందన్న విశ్వాసం తమకు ఉందని ఆయన పేర్కొన్నారు. గత నలభై రెండు రోజులుగా అఖిలపక్ష కమిటీ నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో పాల్గొన్న సబ్బండ వర్గాల ప్రజలకు, రాజకీయ పార్టీలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజా సంఘాలకు ఉద్యోగ ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!