Social 1080×1350 • Multi-page
20-05-2026 BREAKING NEWS 06:09 PM
swarnodayam.com
Telugu Daily News

ఎస్సీ గ్రూప్-1 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – మంత్రి అడ్లూరి, ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి బేడ బుడగ జంగం జన సంఘం వినతి.

ఎస్సీ గ్రూప్-1 కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. – మంత్రి అడ్లూరి, ముఖ్య సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి బేడ బుడగ జంగం జన సంఘం వినతి.
IMG_20260520_180730

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, మే 20: తెలంగాణలో ఎస్సీ గ్రూప్-1 పరిధిలోని 15 ఉప కులాల ఆర్థిక, రాజకీయ సాధికారత కోసం రూ. 5,000 కోట్ల నిధితో ప్రత్యేక ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బేడ బుడగ జంగం జన సంఘం రాష్ట్ర విభాగం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిరిపాటి వేణు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డిలను వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించింది.

హైదరాబాదులో ఆత్మగౌరవ భవనం నిర్మించాలి..
వివిధ పనుల నిమిత్తం రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ వచ్చే నిరుపేద కులబాంధవులకు బస చేయడానికి వసతి లేక రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లలో నానా అవస్థలు పడుతున్నారని సిరిపాటి వేణు ఆవేదన వ్యక్తం చేశారు. వారి ఇబ్బందులను దూరం చేసేందుకు హైదరాబాద్‌లో 1500 గజాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించి, ప్రభుత్వ ఖర్చుతోనే ‘బేడ బుడగ జంగాల ఆత్మగౌరవ భవనం’ నిర్మించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కుల గణన, ఎస్సీ వర్గీకరణను పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వాలి.
వర్గీకరణ జరిగి ఏడాది గడుస్తున్నా గ్రూప్-1 కులాలకు ఆశించిన గుర్తింపు లభించలేదని వేణు పేర్కొన్నారు. గ్రూప్-1 పరిధిలోని 15 కులాల జనాభా దాదాపు 10 లక్షలు ఉండగా, అందులో ఒక్క బేడ బుడగ జంగాల జనాభానే 2 లక్షలకు పైగా ఉందన్నారు. అందువల్ల ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, అత్యధిక జనాభా కలిగిన బేడ బుడగ జంగం వర్గానికి చైర్మన్ పదవి కేటాయించాలని, రాబోయే నామినేటెడ్ పదవుల్లోనూ ఈ కులాలకు సముచిత స్థానం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం సానుకూల హామీ
జన సంఘం విజ్ఞప్తులపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఎస్సీ గ్రూప్-1 లోని అత్యంత వెనుకబడిన కులాల సమస్యలను, ఆత్మగౌరవ భవన ప్రతిపాదనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, త్వరలోనే తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు దేవుని కుమార్, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి చింతల రాజ్ పులేందర్ తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!