Social 1080×1350 • Multi-page
30-05-2026 BREAKING NEWS 06:48 PM
swarnodayam.com
Telugu Daily News

‘రైతుల మహాగర్జన సమర భేరి’ ఈనెల 30కు బదులు జూన్ 14న.. – సభ తేదీలో మార్పు గ్రౌండ్ పర్మిషన్‌లో జాప్యం, అకాల వర్షాలే కారణం. – రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.

‘రైతుల మహాగర్జన సమర భేరి’ ఈనెల 30కు బదులు జూన్ 14న.. – సభ తేదీలో మార్పు గ్రౌండ్ పర్మిషన్‌లో జాప్యం, అకాల వర్షాలే కారణం. – రైతు జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడి.
IMG-20260530-WA0072

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్(పెద్దపల్లి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలులో చూపుతున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ.. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధనే ధ్యేయంగా ఈనెల 30న కరీంనగర్‌లో నిర్వహించాలనుకున్న ‘రాష్ట్ర వ్యాప్త రైతుల మహాగర్జన సమర భేరి’ సభ తేదీ మారింది. అనివార్య కారణాలు, గ్రౌండ్ పర్మిషన్ లభించడంలో జరిగిన జాప్యం వల్ల ఈ సభను వచ్చే జూన్ 14వ తేదీన నిర్వహించనున్నట్లు రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు వెల్లడించారు. శనివారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఇతర నాయకులతో కలిసి ఆయన ఈ వివరాలను ప్రకటించారు.

పోరాటాల ఫలితంగానే ధాన్యపు కొనుగోళ్లు వేగవంతం..
రైతాంగ సమస్యలపై తాము రూపొందించిన ఉధృత పోరాట ప్రణాళికే ప్రతిపక్ష పార్టీల్లో కదలిక తెచ్చిందని పోలాడి రామారావు పేర్కొన్నారు. జేఏసీ పిలుపుతోనే విపక్షాలు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు తెలుపుతున్నాయని గుర్తుచేశారు. అధికారుల, మంత్రుల నిర్లక్ష్యాన్ని క్షేత్రస్థాయిలో ఎండగట్టడం వల్లే ప్రభుత్వం మొద్దునిద్ర వీడిందని, గత రెండు రోజులుగా ధాన్యపు కొనుగోళ్లలో వేగం పెంచిందని తెలిపారు. దీన్ని రైతు ప్రజా సంఘాల పోరాట పాక్షిక విజయంగా ఆయన అభివర్ణించారు.

ప్రభుత్వ విప్‌తో సుదీర్ఘ చర్చలు..
రైతులకు ఇచ్చిన హామీల అమలు, సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తమకు పలువురు మంత్రులు, ప్రభుత్వ పెద్దల నుంచి వర్తమానం అందిందని రామారావు చెప్పారు. ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు స్వయంగా తమను ఆహ్వానించి, రైతు సమస్యలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారని వెల్లడించారు. అయితే, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
సంయమనమే కానీ… వెనుకంజ కాదు!
రాష్ట్రవ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తుండటం, కొనుగోళ్లు ఊపందుకున్న నేపథ్యంలో రైతులకు సభకు రావడానికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రామారావు వివరించారు. ముందుగా నిర్ణయించిన మే 30న కాకుండా.. వచ్చే జూన్ 14న కరీంనగర్‌లో అన్ని వర్గాలను కలుపుకొని, ప్రజా సంఘాల ఐకాస ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి రైతుల సమర భేరి సభను భారీ ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఈ మార్పును తమ వెనుకంజగా భావించవద్దని, కేవలం సంయమనంగా మాత్రమే చూడాలని కోరారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా, బెదిరింపులకు దిగినా భయపడేది లేదని.. హామీల అమలుపై ఒత్తిడి తెచ్చేందుకే జూన్ 14న ఈ సభను జరిపి తీరుతామని పునరుద్ఘాటించారు.
ఈ విలేఖరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు పోరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కొత్తకొండ రవీందర్, కోరుకంటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!