Social 1080×1350 • Multi-page
06-06-2026 BREAKING NEWS 11:52 PM
swarnodayam.com
Telugu Daily News

మండలంలో ముమ్మరంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’

మండలంలో ముమ్మరంగా ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’
IMG-20260606-WA0099

-​ఐదు గ్రామాల్లో ప్రత్యేక గ్రామసభలు.. ప్రజాసమస్యలపై సుదీర్ఘ చర్చ
​-విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గీత హెచ్చరిక
​-కాట్రపల్లికి ప్రీ-ప్రైమరీ స్కూల్ మంజూరు.. ఈ ఏడాది నుంచే తరగతులు…

​మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ , జూన్ 6: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక – 99 రోజుల కార్యాచరణ’లో భాగంగా శనివారం హుజురాబాద్ మండల పరిధిలో ప్రత్యేక గ్రామసభలు ముమ్మరంగా జరిగాయి. మండలంలోని జూపాక, కందుగుల, కనుకులగిద్దె, కాట్రపల్లి, మందాడిపల్లి గ్రామాల్లో ఈ ప్రత్యేక సభలను నిబంధనల ప్రకారం నిర్వహించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ పథకాల అర్హుల ఎంపిక, దీర్ఘకాలిక స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగిన ఈ సభలకు ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆయా శాఖల అధికారులు సభలకు హాజరై, గ్రామాల్లో జరుగుతున్న ప్రగతి పనుల నివేదికలను చదివి వినిపించారు.
​ప్రగతి ప్రణాళికతోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి
​మండలంలోని కనుకులగిద్దె గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి (DRDO) ఎం.గీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల సమగ్ర రూపురేఖలను మార్చడానికే ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తోందని, ప్రజల భాగస్వామ్యంతోనే ఈ ప్రణాళిక విజయవంతం అవుతుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా క్షేత్రస్థాయి అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రజలు తమ గ్రామానికి సంబంధించిన పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సభలో స్థానిక ఎంపీడీవో తూర్పాటి సునీత, ఏపీఎం, ఈజీఎస్ ఏపీఓతో పాటు గ్రామస్థాయి అధికారులు, సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

కాట్రపల్లిలో ప్రజాసమస్యలపై అధికారుల నిలదీత
​కాట్రపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో సర్పంచ్ పెరుమాండ్ల హైమా బిక్షపతి అధ్యక్షతన, స్పెషల్ ఆఫీసర్ రాజేందర్, ఉప సర్పంచ్ గంగాదారీ బిక్షపతి సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సభలో ముఖ్యంగా గ్రామంలోని పారిశుద్ధ్య లోపం, అంతర్గత మురుగుకాల్వల దుస్థితిపై గ్రామస్థులు అధికారులను నిలదీశారు. ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ లైన్లను, వంగిపోయిన స్తంభాలను వెంటనే సరిచేయాలని కోరగా.. విద్యుత్ శాఖ లైన్‌మెన్ స్పందిస్తూ సమస్యలను వెనువెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
​గ్రామంలో యువత పెడదోవ పడుతుండటం, మాదకద్రవ్యాల (డ్రగ్స్) అలవాటుపై గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ విభాగం ప్రతినిధి రమేష్ స్పందిస్తూ, యువత సన్మార్గంలో నడిచేలా, బాలల హక్కుల రక్షణకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. కాట్రపల్లి గ్రామానికి ఈ విద్యాసంవత్సరం నుంచే నూతనంగా ప్రీ-ప్రైమరీ స్కూల్ (పూర్వ ప్రాథమిక పాఠశాల) మంజూరైందని, ఈ ఏడాది నుంచే తరగతులు నిర్వహించబడుతాయని అధికారులు వెల్లడించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
​అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) నిఖిల్ కుమార్ రైతులకు సాగు పద్ధతులపై, ఇరిగేషన్ అధికారులు చెరువుల పరిస్థితిపై, వైద్య సిబ్బంది మరియు ఆశా వర్కర్లు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ హైమా బిక్షపతి మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణ ద్వారా వార్డుల వారీగా నిధులు కేటాయించి కాట్రపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. సభలో పంచాయతీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, ఉపాధి హామీ సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు: డీఆర్‌డీఓ
​గ్రామసభల అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి గీత మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, హరితహారం, ఉపాధి హామీ పనుల పురోగతిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు. విధుల్లో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, గైర్హాజరైనా సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను నిర్దేశిత గడువులోగా వంద శాతం విజయవంతం చేసి, హుజురాబాద్ మండలాన్ని జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలపాలని క్షేత్రస్థాయి సిబ్బందికి పిలుపునిచ్చారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!