Social 1080×1350 • Multi-page
05-07-2026 BREAKING NEWS 08:52 PM
swarnodayam.com
Telugu Daily News

హుజూరాబాద్‌లో రేషన్ బియ్యం పట్టివేత..

హుజూరాబాద్‌లో రేషన్ బియ్యం పట్టివేత..
IMG_20260705_204638

–కిరాణా దుకాణంలో తనిఖీలు,
రెండు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం సీజ్.. సమీప డీలర్ షాపునకు తరలింపు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ : హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా నిల్వ ఉంచిన ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం కావడంతో నిఘా తక్కువగా ఉంటుందనే అంచనాతో అక్రమ నిల్వలకు పాల్పడినట్లు తెలుస్తోంది.

బ్లూకోట్స్ పోలీసులు పట్టుకున్న రేషన్ బియ్యం.

పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ‘రమేష్ కిరాణం’ దుకాణంలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచినట్లు బ్లూకోట్స్ పోలీసులకు ముందస్తు సమాచారం అందింది.
ఈ నమ్మకమైన సమాచారం మేరకు పోలీసులు సదరు కిరాణా షాపుపై ఆకస్మిక దాడి నిర్వహించారు. ఈ తనిఖీల్లో దుకాణంలో దాచి ఉంచిన సుమారు రెండు క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బ్లూకోట్స్ పోలీసులు హుజూరాబాద్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఇ వినోద్‌కు సమాచారం అందించారు.
ఆదివారం సెలవు రోజైనప్పటికీ సమాచారం అందుకున్న వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వినోద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని పరిశీలించి, వాటిని సీజ్ చేశారు. అనంతరం ఆ బియ్యాన్ని భద్రపరచడం కోసం స్థానికంగా ఉన్న సమీప రేషన్ డీలర్ ఎస్ అశోక్ షాపునకు తరలించారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించేందుకు నిల్వ చేశారా? లేదా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. సీజ్ చేసిన బియ్యం నమూనాలను తదుపరి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తెలిపారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా, నిల్వ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని వారు స్పష్టం చేశారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!