Social 1080×1350 • Multi-page
28-07-2026 BREAKING NEWS 04:18 PM
swarnodayam.com
Telugu Daily News

హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు కార్యాశాల ప్రారంభం.

హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా  తెలుగు కార్యాశాల ప్రారంభం.
IMG-20260728-WA0040

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూలై 28: శాతవాహన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అకాడమిక్ ఎంపవర్ మెంట్ ప్రోగ్రాం 100 రోజుల కార్యాచరనలో భాగంగా, హుజురాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు విభాగం సంయుక్త ఆధ్వర్యంలో “సృజనాత్మక రచన & స్క్రిప్ట్ రచనా నైపుణ్యాలు” అంశంపై రెండు రోజుల కార్యశాల మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. ఇందిరాదేవి మాట్లాడుతూ, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి, ఉపాధి దిశగా వారిని తీర్చిదిద్దేందుకు ఈ కార్యశాల దోహద పడుతుందని తెలిపారు. విశ్వవిద్యాలయం చేపట్టిన అకాడమిక్ ఎంపవర్‌మెంట్ కార్యక్రమాలు విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేస్తున్నాయని పేర్కొన్నారు.

కార్యక్రమ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి కార్యశాల లక్ష్యాలు, రెండు రోజుల కార్యక్రమాల వివరాలను వివరించారు. 
ఈ కార్యశాలలో పద్యం, కవిత, కథ, నవల, నాటకం, సినీ గేయం, షార్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ రచన, వికీపీడియా రచన, జానపద గేయాల డాక్యుమెంటేషన్, పరిశోధన పద్ధతులు తదితర అంశాలపై ప్రముఖ ఆచార్యులు, రచయితలు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఈ అంశాలు విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం, భాషా సామర్థ్యాల పెంపునకు ఇటువంటి కార్యశాలలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రచనా నైపుణ్యాలు ప్రతి విద్యార్థికి వ్యక్తిత్వ వికాసంతో పాటు ఉద్యోగ జీవితంలోనూ ఎంతో ఉపయోగ పడతాయని తెలిపారు.
ఈ కార్యశాలలో మొదటిరోజు జరిగిన కార్యక్రమంలో శ్రీ రాజరాజేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల తెలుగు సహాయ ఆచార్యులు బూర్ల వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ "పద్యం మరియు కవిత రచనా నిర్మాణం – సృజనాత్మకత, భావవ్యక్తీకరణ, భావోద్వేగాల సమన్వయం" అనే అంశంపై పద్య, కవితా రచనలో భావసౌందర్యం, శిల్పం, భాషా వైవిధ్యం, ఊహాశక్తి, భావోద్వేగాల సమన్వయం వంటి అంశాలు రచనకు ప్రాణం పోస్తాయని వివరించారు.* రచయితలో పరిశీలనా దృష్టి, భాషపై పట్టు, సృజనాత్మక ఆలోచన ఉంటేనే ఉత్తమ కవిత్వం ఆవిష్కృతమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యాశాలకు హాజరైనటువంటి విద్యార్థులు మరియు పరిశోధకులతో కవితలు గేయాలను స్వయంగా రచింప చేశారు.

గేయ రచయిత, గాయకుడు పెందోట జయసూర్య, “సినీ, జానపద, ప్రేరణాత్మక గేయాలు – రచనా నైపుణ్యాలు” అనే అంశంపై ప్రసంగించారు.
గేయ రచనలో సందర్భానుసారమైన పదాల ఎంపిక, లయ, ఛందస్సు, భావవ్యక్తీకరణ, సంగీతానుకూలత, శ్రోతలను ఆకట్టుకునే పదబంధాల ప్రాముఖ్యతను వివరించారు. సినీ గేయాలు, జానపద గేయాలు, ప్రేరణాత్మక గేయాల మధ్య ఉన్న ప్రత్యేకతలను ఉదాహరణలతో వివరిస్తూ విద్యార్థులను రచన వైపు ప్రోత్సహించారు. అనంతరం శాతవాహన విశ్వవిద్యాలయం, తెలుగు విభాగం అధ్యాపకులు డా. కె. లక్ష్మినారాయణ, “కథ – నవల శిల్పం మరియు ప్రాయోగిక రచనా నైపుణ్యాలు” అనే అంశంపై ప్రసంగించారు. కథ, నవలల నిర్మాణం, పాత్ర చిత్రణ, సంఘర్షణ, కథన శైలి, సంభాషణలు, ఇతివృత్త ఎంపిక, కథా వికాసం వంటి అంశాలను విశ్లేషించారు. రచయిత సమాజాన్ని లోతుగా పరిశీలించి జీవనానుభవాలను సాహిత్య రూపంలో ఆవిష్కరించినప్పుడే రచనకు శాశ్వత విలువ లభిస్తుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ డా కె లింగారెడ్డి, ఐ.క్యు.ఎసి.కో ఆర్డినేటర్ డా బి. రేణుక, అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు, రచయితలు, సాహిత్యాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


*లోకల్ యాడ్స్*

స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!