Social 1080×1350 • Multi-page
08-08-2026 BREAKING NEWS 06:51 PM
swarnodayam.com
Telugu Daily News

గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా ఆదర్శం.. -రూ.11.26 కోట్ల బకాయిల్లో రూ.5.71 కోట్లు చెల్లింపు

గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా ఆదర్శం.. -రూ.11.26 కోట్ల బకాయిల్లో రూ.5.71 కోట్లు చెల్లింపు
IMG_20260808_184915

–50 శాతం విద్యుత్ బిల్లులు క్లియర్ చేసిన పంచాయతీలు

–రాష్ట్రంలో అత్యధిక చెల్లింపులు చేసిన జిల్లాల్లో కరీంనగర్‌కు ఆరో స్థానం

–రీకన్సిలియేషన్‌తో రూ.2.14 కోట్ల బిల్లుల భారం తగ్గింపు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఆగస్టు 8: గ్రామ పంచాయతీల విద్యుత్ బిల్లుల చెల్లింపులో కరీంనగర్ జిల్లా రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. గ్రామపంచాయతీల సొంత నిధుల నుంచి విద్యుత్ వినియోగ బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పటివరకు సుమారు 50 శాతం బకాయిలను చెల్లించినట్లు వెల్లడించారు.

జనవరి 2026 నుంచి జూలై 2026 వరకు కరీంనగర్ జిల్లాలోని గ్రామపంచాయతీలకు సంబంధించిన విద్యుత్ బకాయిలు రూ.11.26 కోట్లు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పంచాయతీ, విద్యుత్ శాఖ అధికారుల సమన్వయంతో గ్రామపంచాయతీలు తమ సొంత నిధుల నుంచి రూ.5.71 కోట్లు విద్యుత్ బిల్లులుగా చెల్లించాయని పేర్కొన్నారు.

గ్రామపంచాయతీల సొంత నిధుల నుంచి ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు చెల్లించిన జిల్లాల్లో కరీంనగర్ రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని కలెక్టర్ తెలిపారు.

పెండింగ్ ఛార్జీలపై ప్రత్యేక రీకన్సిలియేషన్

గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిలను వాస్తవంగా నిర్ధారించేందుకు టీజీఎన్‌పీడీసీఎల్, జిల్లా పంచాయతీ అధికారి సమన్వయంతో గ్రామపంచాయతీల వారీగా ప్రత్యేక రీకన్సిలియేషన్ ప్రక్రియ చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.

మండల పంచాయతీ అధికారులు, సంబంధిత విద్యుత్ శాఖ అసిస్టెంట్ అకౌంట్స్ అధికారులతో కలిసి ప్రతి గ్రామపంచాయతీకి సంబంధించిన పెండింగ్ బిల్లులను సమగ్రంగా పరిశీలించారు. ఈ ప్రక్రియ అనంతరం రూ.2.14 కోట్ల మేర బిల్లుల భారం పంచాయతీలపై తగ్గినట్లు తెలిపారు.

వాస్తవ విద్యుత్ బకాయిలను ఖచ్చితంగా నిర్ధారించి, వాటి క్లియరెన్స్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.

ఇకపై నెలవారీగా బిల్లుల చెల్లింపు

గ్రామపంచాయతీల విద్యుత్ బకాయిలను పూర్తిస్థాయిలో క్లియర్ చేయడంతో పాటు, భవిష్యత్తులో ప్రతి నెల విద్యుత్ వినియోగ ఛార్జీలను సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.

సర్పంచుల సహకారంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో అన్ని రకాల పన్నుల బకాయిలను వసూలు చేయాలని సూచించారు. పన్నుల వసూళ్లతో పాటు గ్రామపంచాయతీలకు వచ్చే అద్దెలు, వేలం తదితర ఇతర ఆదాయ మార్గాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.

స్థానికంగా గ్రామపంచాయతీల ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుని గ్రామాల్లో మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టే అవకాశం ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

  • మొత్తం విద్యుత్ బకాయిలు: రూ.11.26 కోట్లు
  • పంచాయతీలు చెల్లించిన మొత్తం: రూ.5.71 కోట్లు
  • చెల్లింపు శాతం: సుమారు 50%
  • రీకన్సిలియేషన్‌తో తగ్గిన బిల్లుల భారం: రూ.2.14 కోట్లు
  • రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా స్థానం: 6వ స్థానం
  • కాలవ్యవధి: జనవరి 2026 – జూలై 2026

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!