Social 1080×1350 • Multi-page
24-08-2026 BREAKING NEWS 09:09 PM
swarnodayam.com
Telugu Daily News

ఎలబోతారం గ్రామంలో వీడిన వృద్ధురాలి మృతి మిస్టరీ.. – మూఢనమ్మకంతో కన్నవారే ఆ తల్లిని కాటికి పంపారు.. – ఇద్దరు కుమారుల అరెస్ట్.

ఎలబోతారం గ్రామంలో వీడిన వృద్ధురాలి మృతి మిస్టరీ.. – మూఢనమ్మకంతో కన్నవారే ఆ తల్లిని కాటికి పంపారు.. – ఇద్దరు కుమారుల అరెస్ట్.
Oplus_16908288

— మృతి మిస్టరీనీ కొన్ని గంటల్లో ఛేదించిన సైదాపూర్ పోలీసులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (సైదాపూర్) హుజురాబాద్, ఆగస్టు 24: కనీ, పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని ఆఖరి మజిలీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నా కొడుకులు మూఢనమ్మకంను నమ్మి కన్నతల్లినే అత్యంత దారుణంగా, కర్కషంగా చంపి బావిలో తోసివేసిన సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఎలబోతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది.

కన్న తల్లిని హత్య చేసిన నిందితులను అరెస్టు చూపిస్తున్న సిఐ శ్రీనివాస్, ఎస్ఐ స్వాతి..

సైదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వి శ్రీనివాస్, ఎస్సై స్వాతి మాట్లాడుతూ..
సైదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎలబోతారం గ్రామంలో సుమారు 80 ఏళ్ల వయస్సు గల వెంకటమ్మ గత పది రోజులుగా పక్షవాతంతో మంచానికే పరిమితమై, తన రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితిలో జీవిస్తుంది. ఆమె రక్తం పంచుకుని పుట్టిన నలుగురు కుమారులు వంతుల వారీగా ఆమెకు భోజనం అందిస్తూ సంరక్షణ చూసుకునేవారు.
అయితే ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగిన చర్చల్లో వెంకటమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆమె తమలో ఎవరి ఇంట్లో మృతి చెందినా ఆ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తుందనే మూఢనమ్మకంతో కొందరు కుటుంబ సభ్యులు ఆలోచించినట్లు దర్యాప్తులో పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలో పెద్ద కుమారుడు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాసు కలిసి వెంకటమ్మను హత్య చేయడానికి పథకం రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అనంతరం ఇతర కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో కన్న తల్లి అని చూడకుండా పక్షవాతంతో బాధపడుతున్న ఆ తల్లిని ఇద్దరు కుమారులు ఇంటి నుంచి తీసుకెళ్లి సమీపంలోని వ్యవసాయ బావిలో పడవేసి చంపినట్లు పోలీసుల విచారణలో గుర్తించారు. మళ్లీ ఏమి ఎరగనట్టు తమ తల్లి కనిపించకుండా పోయిందని, ఆమె కోసం వెతుకుతున్నట్లుగా ఇద్దరు నిందితులు, ఇతర కుటుంబ సభ్యులను, గ్రామస్తులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా ఆమె ఎక్కడికో వెళ్లిపోయి ఉంటుందని పోలీసులకు సమాచారం ఇచ్చి, అసలు విషయాన్ని దాచిపెట్టేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది.
అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న సైదాపూర్ పోలీసులు గ్రామంలో పలుమార్లు విచారణ చేపట్టి, కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వారి వాంగ్మూలాలు, సంఘటనకు సంబంధించిన పరిస్థితులు, నిందితుల ప్రవర్తనను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఇతర ఆధారాలను సేకరించారు. ఈ దర్యాప్తులో వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన వెంకటమ్మ మృతిపై అనుమానాలు తలెత్తడంతో కుటుంబ సభ్యులను కన్న కొడుకులను అదుపులోకి తీసుకొని విచారించగా పెద్ద కొడుకు నూనె సమ్మయ్య, చిన్న కుమారుడు నూనె శ్రీనివాస్ లు హత్యకు పాల్పడినట్లు వెలుగులోకి వచ్చిందన్నారు.
ఈ ఘటనపై BNSS సెక్షన్ 194 ప్రకారం ఇన్‌క్వెస్ట్ నిర్వహించి, తదుపరి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో హత్యకు సంబంధించిన ఆధారాలు లభించడంతో BNS సెక్షన్ 103(1), 238 r/w 3(5) కింద నిందితులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సిఐ శ్రీనివాస్, ఎస్ఐ స్వాతిలు తెలిపారు.

కాటికి కాలు చాచిన వయసులో అంగవైకల్యంతో మంచం పట్టిన కన్న తల్లికి సఫర్యలు చేయాల్సిన కొడుకులు..అత్యంత కాటిన్యంగా వ్యవహరించి హత్య చేసి తప్పించుకోవాలని చూసి అడ్డంగా దొరికి సభ్య సమాజానికి తల వంపులు తెచ్చారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!