జీ.వో 97ను తక్షణమే రద్దు చేయాలి. – పోలాడి రామారావు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ : ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ లను మూసి వేయాలనే దుర్మార్గపు ఆలోచనలను విరమించుకోవాలని, దీనికి సంబందించిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
సాంకేతిక విద్యా రంగంలో ప్రత్యేక గుర్తింపు గల పాలిటెక్నిక్ విద్యను రద్దు చేయాలానే ఆలోచన సరికాదన్నారు. పాలిటెక్నిక్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థుల కు అనేక ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలను మహేంద్ర స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలనే ప్రయత్నాలను మానుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలలకు వందల ఎకరాల విలువైన భూములు ఉన్నాయని ముఖ్యoగా మాసాబ్ ట్యాంక్ వద్ద గల పాలిటెక్నిక్ కాలేజీకి 5వేల కోట్ల రూపాయల విలువైన భూములుఉన్నాయన్నారు. ఇట్టి భూముల పై ప్రైవేట్ వ్యక్తులు ఎంతో కాలంగా కన్నేసి ఉంచారని ఆరోపణలు వినవస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పుడు నిర్ణయానికి నిరసనగా విద్యార్థులతో కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని పోలాడి రామారావు తీవ్రంగా హెచ్చరించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల బలోపితానికి నిధులు కేటాయించి ఉద్యోగావకాశాలు కల్పించాలని బహిరంగ లేఖ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి ప్రజా సంఘాల తరపున విజ్ఞప్తి చేశారు. లేఖ ప్రతులను కరీంనగర్ తెలంగాణ చౌక్ లో మంగళవారం మీడియా ప్రతినిధులకు పోలాడి రామారావు అందజేసీ మాట్లాడారు.

