వీసా రూల్స్ లో తెలంగాణ ఎన్.ఆర్.ఐలకు సడలింపులివ్వండి. – అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులకు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వినతి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వరంగల్: ఐటీ సాఫ్ట్ వేర్, ఉన్నత చదువుల కోసం అమెరికాలో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలకు వీసా నిబంధనల్లో సడలింపులివ్వాలని అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు కోరారు.
వివిధ దేశాల్లో పార్లమెంట్ ల పనితీరుపై అధ్యయనంలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న రవీందర్ రావు వర్జీనియా 10వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ ప్రతినిధి సుహాస్ సుబ్రమణ్యం, 11వ డిస్ట్రిక్ట్ ప్రతినిధి జేమ్స్ వాకిన్ షాలను కలిశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ప్రజలందరినీ ఏకం చేసి ఉద్యమించిన తీరును, స్వరాష్ట్రం ఏర్పాటైన విషయాలను వివరించగా, వారు ఆసక్తిని కనబరించారు. అదేవిధంగా అమెరికాలో పార్లమెంటు నిర్వహణ, ప్రజా సమ్యసలను ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించే తీరును కూడా ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అమెరికాలో 12 లక్షల మందికి పైగా తెలుగు వాళ్లు నివసిస్తున్నారని, అందులో 6 లక్షల మంది వరకూ తెలంగాణ వాసులు ఉన్నారని టూరిస్టు వీసాల్లో ఆ కుటుంబాలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్సీ రవీందర్ రావు వారిద్దరికీ వివరించారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ వారికి అన్నిరకాల వీసాల నిబంధనల్లో మినహాయింపులిచ్చే విషయమై, ఒక లక్ష డాలర్ల ఫీజు చెల్లింపును తగ్గించే విషయమై పార్లమెంటులో ప్రస్తావించాలని తక్కెళ్లపల్లి వారిద్దరికీ విన్నవించగా, వారు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్ ప్రతినిధులను కలిసిన వారిలో ఎమ్మెల్సీ రవీందర్ రావుతోపాటు సామాజిక విశ్లేషకులు పులి రవి, డాక్టర్ బిక్షం గుజ్జ కూడా ఉన్నారు.

