ఎంబీబీఎస్ సీట్లు సాధించిన విద్యార్థులకు ఘన సన్మానం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ కాకతీయ జూనియర్ కళాశాలలో చదివి నీట్-2026లో ర్యాంకులు సాధించి ఎంబీబీఎస్‌లో సీట్లు పొందిన విద్యార్థులను బుధవారం కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

నీట్-2026లో రుబియా ఫాతిమా జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో, ఎస్. నాగ విశిష్ట ప్రతిమా మెడికల్ కాలేజీ వరంగల్‌లో ఎంబీబీఎస్ సీట్లు సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మారబోయిన వేణుమాధవ్ మాట్లాడుతూ, విద్యార్థుల కృషి, తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ఈ విజయాన్ని సాధించారని తెలిపారు. పట్టుదలతో లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడితే కార్పొరేట్ కళాశాలల్లోనే కాకుండా సాధారణ కళాశాలల్లో చదివినా ఎంబీబీఎస్ సీటు సాధించవచ్చని విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు.
విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలు రెండేళ్ల పాటు మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి అహర్నిశలు కష్టపడ్డారని తెలిపారు. విద్యార్థుల విజయంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు చల్మల్ల రాజేశ్వర్ రెడ్డి, కవ్వ ప్రవీణ్ రెడ్డి, జున్నూతుల ప్రకాశ్ రెడ్డితో పాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు.

