మట్టి వినాయకుని పూజించి ప్రకృతిని కాపాడాలి.. -మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, మట్టి వినాయక విగ్రహాలను పూజించి ప్రకృతిని కాపాడాలని మాంటిస్సోరి పాఠశాల ప్రిన్సిపాల్ గీతాషాజు అన్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని మాంటిస్సోరి పాఠశాలలో శుక్రవారం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మట్టి, పిండి పదార్థాలతో స్వయంగా వినాయక విగ్రహాలను తయారు చేశారు. అనంతరం వాటిని తమ తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గీతాషాజు మాట్లాడుతూ.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమవుతాయని తెలిపారు. మట్టి, సహజ పదార్థాలతో తయారు చేసిన వినాయక విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించవచ్చన్నారు. చిన్ననాటి నుంచే విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత, పర్యావరణ స్పృహ పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

