విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : స్థానిక హుజురాబాద్ పట్టణంలోని విజ్ఞాన్ నెక్స్ట్‌జెన్ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలను వినూత్నంగా, ఎంతో ఉత్సాహ భరితంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థుల అమ్మమ్మలు, తాతయ్యలు, అలాగే నానమ్మలు, తాతయ్యలు సుమారు 150 జంటలుగా హాజరై సందడి చేశారు.



ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ దాసరి కోటేశ్వర్ యాదవ్ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తుకు భావితరాలు ఎంత ముఖ్యమో, వారికి క్రమశిక్షణ, విలువలు, నైతికతతో కూడిన విద్య అందించడం కూడా అంతే ముఖ్యమని అన్నారు.
నానమ్మలు, అమ్మమ్మలు మరియు తాతయ్యలు, పిల్లల జీవితాల్లో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలను క్రమశిక్షణతో పెంచుతుంటే, తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు వారిపై ఆప్యాయత, ప్రేమను చూపిస్తూ కుటుంబ విలువలను నేర్పుతారని అన్నారు. వారు పిల్లలకు కథలు చెబుతూ, పాటలు పాడుతూ, తమ జీవిత అనుభవాలను పంచుకుంటూ వారికి ప్రేమ, ఆత్మీయతను అందిస్తారని తెలిపారు.
ఇంట్లో పెద్దలు ఉంటే ఆ ఇంటి సందడే వేరు అని పేర్కొన్న ఆయన, వారి అనుభవం, ప్రేమ, ఆశీస్సులు ప్రతి కుటుంబానికి గొప్ప బలం, ధైర్యం, మార్గదర్శకత్వాన్ని అందిస్తాయని అన్నారు. మన విజయాల్లో వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని, అందుకే తాతయ్యలు, నానమ్మలు అమ్మమ్మలను ప్రేమతో చూసుకోవడంతో పాటు గౌరవించాలని సూచించారు.
గ్రాండ్ పేరెంట్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ తాతయ్యలు, అమ్మమ్మలతో కలిసి ఆటల పోటీలలో పాల్గొని ఆనందంగా గడిపారు. వాటిలో గెలుపొందిన వారికి పాఠశాల యాజమాన్యం శాలువాతో సత్కరించి బహుమతులు అందించడం జరిగింది.



ఈ కార్యక్రమంలో పాఠశాల అడ్వైజర్ గంజి జయవర్ధన్, డైరెక్టర్ తిరుపతి యాదవ్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, పెద్ద సంఖ్యలో తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మలు పాల్గొన్నారు.

