కాంగ్రెస్ పార్టీ వైఫల్యం : ప్రజా పాలన దినోత్సవానికి హుజురాబాద్ లో నేతల దూరంగా ఉండటంపై విమర్శలు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: రాచరిక పాలనకు ముగింపు పలికి, ప్రజాస్వామ్యానికి నాంది పలికిన చారిత్రక ఘట్టమైన “తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం” సందర్భంగా హుజురాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకుల వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ స్వేచ్ఛ కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించాలనీ స్వయంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఆదేశించగా, అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక పార్టీ కార్యాలయంలో ఈ వేడుకలకు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది.


జెండా ఆవిష్కరణకు గైర్హాజరు:
నియోజకవర్గ ఇన్చార్జ్ అందుబాటులో లేకపోయినప్పటికీ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించకుండా మండల లేదా పట్టణ అధ్యక్షులు ముందడుగు వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే, కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా దీనిపై దృష్టి సారించకపోవడం, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల స్థానిక ప్రజలు మరియు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రతిపక్షాల ముందంజ:
ఒకవైపు బిజెపి సహా ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు ఘనంగా జెండాలు ఆవిష్కరించి వేడుకలు జరపడం, మరోవైపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారికంగా ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించడం విశేషం. స్వయంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులే ఈ చారిత్రక దినోత్సవాన్ని విస్మరించడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని బిజెపి మరియు ఇతర పార్టీల నాయకులు విమర్శిస్తున్నారు.

