హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యానికి విజయం.. – దానం నాగేందర్ ఫైటర్ కాదు.. చీటర్.. – ఇది కెసిఆర్ విజయం BRS పార్టీ విజయం.. – ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

—తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్‌మీట్
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యం సాధించిన విజయమని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్‌ఎస్ పార్టీ తరఫున హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.
“ఇది బీఆర్‌ఎస్ పార్టీ విజయం.. కేసీఆర్ నాయకత్వం, బీఆర్‌ఎస్ పోరాటానికి దక్కిన విజయం” అని పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.

దానం నాగేందర్ అనర్హత కోసం గత రెండున్నరేళ్లుగా బీఆర్‌ఎస్ పార్టీ చేస్తున్న పోరాటానికి ఈ తీర్పుతో ఫలితం దక్కిందన్నారు. ప్రజలను ఎల్లకాలం మోసం చేయవచ్చని సీఎం రేవంత్ రెడ్డి భావించారని, కానీ హైకోర్టు తీర్పుతో ఆ వ్యవహారానికి బ్రేక్ పడిందని అన్నారు.
“ఈ తీర్పు సీఎం రేవంత్ రెడ్డికి చెంపపెట్టు లాంటిది” అని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
దానం నాగేందర్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేల అంశంలోనూ న్యాయపరమైన పరిణామాలు ఉంటాయని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మిగతా ఎనిమిది నియోజకవర్గాల్లోనూ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, “ఏ పార్టీకి చెందినవారమో చెప్పుకోలేని పరిస్థితి ఫిరాయింపు ఎమ్మెల్యేలది” అని అన్నారు.
“అమ్మా, నాన్న ఎవరో చెప్పుకోలేని పరిస్థితి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలది” అంటూ పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఖైరతాబాద్ ఉపఎన్నిక వస్తే బీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందని, ఖైరతాబాద్ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ మోసాలకు తగిన తీర్పు ఇస్తారని అన్నారు.
కడియం శ్రీహరి వ్యవహారంపైనా పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. “పార్టీ మారింది కడియం శ్రీహరి. అనైతికం ఎవరిది అనేది ఎథిక్స్ కమిటీ తేల్చాలి” అని అన్నారు.
దానం నాగేందర్‌పై తీవ్ర విమర్శలు చేసిన పాడి కౌశిక్ రెడ్డి, “దానం నాగేందర్ ఫైటర్ కాదు.. చీటర్” అని వ్యాఖ్యానించారు.“దానం నాగేందర్‌కు పట్టిన గతే పార్టీ మారిన మిగతా ఎనిమిది మందికి కూడా పడుతుంది” అని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
మొత్తంగా, హైకోర్టు తీర్పు పార్టీ ఫిరాయింపులపై జరుగుతున్న రాజకీయ, న్యాయ పోరాటంలో కీలక పరిణామమని ఆయన పేర్కొన్నారు.

