కలిసికట్టుగా ఉంటేనే సమస్యల పరిష్కారం : – కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఐక్యమత్యంతోనే ఎలాంటి సమస్యలనైనా సాధించవచ్చని, రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులకు తగిన అండగా ఉంటానని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, 12వ వార్డు కౌన్సిలర్ వర్ధినేని రవీందర్ రావు స్పష్టం చేశారు. ఆదివారం హుజురాబాద్ క్లబ్‌లో నిర్వహించిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా వర్ధినేని రవీందర్ రావు మాట్లాడుతూ… ఉద్యోగ విరమణ పొందిన కార్మికులు తమ హక్కుల సాధనకు ఒకే తాటిపై నిలబడాలని పిలుపునిచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తన దృష్టికి తెస్తే పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని రాజయ్య మాట్లాడుతూ… పెన్షన్, ఈపీఎఫ్, బకాయిల సాధనకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1995 తర్వాతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్‌ను రూ.15 వేల నుండి రూ.25 వేల వరకు కేంద్ర ప్రభుత్వం పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే, సూపర్ లగ్జరీ బస్సుల్లో రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉచిత ప్రయాణ సౌకర్యంపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్త రవీందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి పేరాల లక్ష్మణరావు, ట్రెజరర్ ఏబీ రెడ్డి, ముఖ్య సలహాదారు ఎంఆర్ మొగిలి, నాయకులు పీఎస్ రెడ్డి, బీఆర్ మౌళి, కేపీ రెడ్డి, గోలి ఉపేందర్, వీడీ రెడ్డి, బత్తిని సంజీవ్, కంకల కొమురయ్య, బి మొగిల్య తదితరులు పాల్గొన్నారు.

