ఉద్యోగుల తీరుపై సర్పంచుల ఆగ్రహం.. – పలు సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ : హుజురాబాద్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో సంబంధిత అధికారులు చిత్తశుద్ధితో పనిచేయడం లేదని పలువురు సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం హుజురాబాద్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశం హుజురాబాద్ ఆర్డిఓ నాయక్ వాడి జల కుమారి అధ్యక్షతన జరిగింది.



ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల చెల్లింపులో జాప్యం జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆర్థికంగా కష్టాల పాలవుతున్నారని, అంగన్వాడి టీచర్లు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని, విద్యుత్ కోతలు తీవ్రంగా ఉండడంతో ప్రజలు ముఖ్యంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం జాప్యం అవుతుందని పలువురు సర్పంచులు మండల సభలో ఆవేదన వ్యక్తం చేశారు. చెల్పూరు, సిర్సపల్లి తదితర గ్రామాలలో ఐసిడిఎస్ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడం లేదని సర్పంచ్లు వంతడుపుల కస్తూరి, పోల్సాని రామారావులు ఆరోపించారు. వారు చేస్తున్న పనుల్లో సర్పంచులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని అన్నారు. చెల్పూర్ లో కరెంటు కోతలు ఎప్పుడు వస్తాయో తెలియక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారనీ అన్నారు. తోకలపల్లె వద్ద ఆర్టీసీ బస్సులు ఆపక పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. మహిళా సర్పంచులకు ఉద్యోగులు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని సర్పంచ్ కస్తూరి ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. పింఛన్ల మంజూరులో ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్తవారికి ఇవ్వాలన్నారు. అనర్హులకు సదరం సర్టిఫికెట్ ప్రధానం చేయడం, అర్హులకు రాకపోవడం, అంగడిలో అమ్ముకోవడం సరికాదన్నారు.అనంతరం ఆర్డీవో జల కుమారి మాట్లాడుతూ…. ప్రజా సమస్యల పరిష్కారంలో ఉద్యోగులు ప్రజా ప్రతినిధులను కలుపుకొని సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. సమస్యల పరిష్కారంలో తాను కృషి చేస్తానని అన్నారు. ఈ సమావేశంలో హుజురాబాద్ ఎంపీడీవో తూర్పాటి సునీత, తహసిల్దార్ జక్కని నరేందర్, లతా మంగేశ్వరి, ఉష శ్రావణి, పలువురు సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

