హుషారుగా గణేష్ నిమజ్జన వేడుకలు..- వర్షాన్ని సైతం లెక్క చేయక వెళ్లి విరిసిన భక్తి భావం.. – దగ్గరుండి వేడుకలను పర్యవేక్షించిన అధికారులు, ప్రజాప్రతినిధులు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో గణేశ్ నిమజ్జన వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించగా మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షం కురుస్తున్నా భక్తుల ఉత్సాహం ఏ మాత్రం తగ్గలేదు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాల్లో గణనాథుల విగ్రహాలను నిర్వాహకులు నిమజ్జనానికి తరలించారు.

పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 150కి పైగా గణేశ్ విగ్రహాలను నిమజ్జనానికి తరలించగా, వేలాది మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిమజ్జన కార్యక్రమాలను ప్రారంభించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జన ప్రదేశాల్లో క్రేన్లు, లైటింగ్, తాగునీరు, వైద్య శిబిరాలు, అత్యవసర సేవలను ఏర్పాటు చేశారు.

భద్రత కోసం ఏసిపి వి మాధవి, టౌన్ సిఐ కరుణాకర్, రూరల్ సీఐ వి శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షించడంతో పాటు, నిమజ్జనం చేసే ఎస్ఆర్ ఎస్ పి డిబిఎం 16 ఉప కాలువ వద్ద గజ ఈతగాళ్లు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలను అందుబాటులో ఉంచారు. భక్తులు క్రమశిక్షణతో నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనాలని అధికారులు సూచించారు.


నిమజ్జన ప్రాంతాల వద్ద భారీ ఏర్పాట్లు
గణనాథుల నిమజ్జనం సందర్భంగా పట్టణ శివారులోని కొత్తపల్లి ఎస్సారెస్పీ కెనాల్, కాకతీయ కాలువ పరిసరాల్లో పురపాలక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, ఆరోగ్యశాఖ సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లను పర్యవేక్షించారు. విగ్రహాల నిమజ్జనం సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టారు.


తొలి నిమజ్జనాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ సుహాసిని
కాకతీయ కాలువ వద్ద తొలి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రొంటాల సుహాసిని ప్రారంభించి స్వయంగా విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జల కుమారి, మున్సిపల్ కమిషనర్ కిషన్, వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



ఆకట్టుకున్న ఉత్సవ కమిటీ సత్కారం.
పట్టణంలోనీ అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన ఉత్సవ సమితి అధ్యక్షులు రవీందర్ రెడ్డి, నటరాజ్, కమిటీ సభ్యులు గణేష్ ఉత్సవ నిర్వాహకులకు స్వాగతం పలుకుతూ స్టేజ్ పైకి ఆహ్వానించి జ్ఞాపికలు అందజేసి శాలువాలు కప్పి సత్కరించడం పలువురిని ఆనందానికి గురిచేసింది. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ రోంటాల సుహాసిని, ఏసిపి మాధవి, టౌన్ సిఐ కరుణాకర్, మున్సిపల్ కమిషనర్ కిషన్, పాలకవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల భక్తి ఆటపాటలు ఆకట్టుకున్నాయి. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక భక్తులు విగ్రహాలను వాడ వాడన ఊరేగించి తెల్లవారుజాము వరకు నిమజ్జన వేడుకలు కొనసాగాయి.

