వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్‌గా రాముల నియామకం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి ఉత్సవ రాష్ట్ర కమిటీ వైస్ చైర్మన్‌గా హుజురాబాద్ మండలానికి చెందిన రాముల కుమార్ ను నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించనున్న వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ 131వ జయంతి వేడుకల కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉత్సవ కమిటీలో తనను వైస్ చైర్మన్‌గా నియమించినందుకు రాష్ట్ర జయంతి ఉత్సవ కమిటీకి రాముల కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా రాముల కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగం, పేదలు, బడుగు-బలహీన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరనారి చాకలి (చిట్యాల) ఐలమ్మ స్ఫూర్తి చిరస్మరణీయమని అన్నారు.
ఐలమ్మ గారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి అందించడంతో పాటు, ఆమె ఆశయాలు, సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం వంటి విలువలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఐలమ్మ 131వ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయడానికి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజల సహకారంతో సమిష్టిగా పనిచేస్తానని రాముల కుమార్ పేర్కొన్నారు.

