గడీల అహంకారాన్ని బద్దలు కొట్టిన నిప్పు రవ్వ చాకలి ఐలమ్మ… పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దాం– ప్యారడైజ్ మూవీ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తికి నిదర్శనం.. -ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షులు పోలాడి రామారావు.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణ పౌరుషానికి ప్రతీక వీరనారి చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తిని కొనసాగిద్దామని ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.
వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం కలెక్టరేట్ రహదారిలోని చాకలి ఐలమ్మ విగ్రహ కూడలిలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆమె జయంతి కార్యక్రమంలో నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.



ఈ సందర్భంగా పోలాడి రామారావు మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం, పేదలు మరియు అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం ధైర్యంగా పోరాడిన మహా వీరనారి అని కొనియాడారు. భూస్వామ్య దోపిడీకి, అన్యాయానికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పేద బడుగు బలహీన అణగారిన వర్గాల హక్కులకై పోరాడి ఆమె చూపిన ధైర్యం,తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కనిక నేటి తరానికి ఐలమ్మ స్ఫూర్తిదాయకమన్నారు.
సెన్సేషన్ ప్యారడైజ్ మూవీ లో సమ్మక్క పాత్ర అచ్ఛం చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ని గుర్తుకు తెస్తుందన్నారు.
భూమి కోసం భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం దొరల గుండెల్లో నిద్రపోయిన ఐలమ్మ వీరత్వాన్ని నేటి పాలకులు కేవలం ఎన్నికల ఓట్ల కోసమే పరిమితం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. వీరుల విగ్రహాలకు దండలు వేసి మొక్కుబడి నాటకాలు ఆడుతున్న నాయకులు వారి ఆశయాలను మాత్రం బలిపీఠం ఎక్కిస్తున్నారని దుయ్యబట్టారు.
నాడు నిజామ్ రజాకార్లు దేశ్ ముఖ్ లు పేదల రక్తాన్ని జలగల్లా పీల్చితే నేడు కొత్త రూపంలో కార్పొరేట్ గద్దలు అవినీతి పెత్తందార్లు సామాన్యులను నలిపేస్తున్నారని ద్వజమెత్తారు. దశబ్దాలు గడుస్తున్నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు బానిస బతుకులే మిగుల్చుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, విద్య, ఉపాధి, రాజకీయ ప్రాదాన్యత కోసం అనగారిన వర్గాలు మరో ప్రజా ఉద్యమానికి సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు. హక్కులను ఎవరూ బిక్షగా వేయరని ఐలమ్మ చూపిన తిరుగుబాటు బాటలోనే బరిలోకి దిగి లాక్కొవాలని పోలాడి పిలుపునిచ్చారు. జల్లుకట్టు కొరకు చెన్నైలో జరిగిన పోరాటంతో ప్రత్యేక రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు దేశంలో సగానికి పైగా ఉన్న బీసిలకు న్యాయ పరంగా కనీసం 40శాతం రిజర్వేషన్ల కోసం రాజ్యాంగ సవరణ చేయడంలో తాత్సరం చేయకుండా పాలకులు తక్షణ చర్యలు చేపట్టాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు
చాకలి ఐలమ్మ పోరాటం కేవలం ఒక వ్యక్తి పోరాటం కాదని, పేదలు, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన సామాజిక పోరాటానికి ప్రతీక అని రామారావు అన్నారు.
నేటి సమాజంలో కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు మరియు అణగారిన వర్గాలకు సమాన అవకాశాలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం దక్కాల్సిన అవసరం ఉందన్నారు. చాకలి ఐలమ్మ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం కోసం,వివిధ వర్గాల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ప్రజల పక్షాన ప్రజా సంఘాల జేఏసీ పోరాడుతుందని తెలిపారు.
“చాకలి ఐలమ్మ చూపిన పోరాట మార్గం మనకు స్ఫూర్తి. ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు మనం ఇచ్చే నిజమైన నివాళి” పోలాడి రామారావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయీబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు జంపాల నర్సయ్య, బీ.సి హక్కుల సాధన రాష్ట్ర నాయకులు సుద్దాల రాజయ్య, ప్రజా సంఘాల జేఏసీ ఉమ్మడి జిల్లా నాయకులు, బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, కొత్తకొండ రవీందర్ రావు, బోయినపల్లి శ్రీనివాసరావు, అండెం రమణారెడ్డి తదితరలు పాల్గొన్నారు.

