స్కెచ్ వేసి హత్య.. రెండోసారి తప్పించుకోలేకపోయిన రాకేష్! -ఎస్సారెస్పీ కాలువ వద్ద దారుణ హత్య.. – వివాహేతర సంబంధమే కారణమా?హత్యకు సహకరించిన ఆరుగురు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.. – అధికారిక ధ్రువీకరణ కోసం ఎదురుచూపు

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి
హుజూరాబాద్, సెప్టెంబర్ 28: కరీంనగర్ జిల్లా
హుజూరాబాద్ పట్టణ పరిధిలోని కె.సి. క్యాంపు సమీపంలో దారుణ హత్య కలకలం రేపింది. ఎస్సారెస్పీ బ్రిడ్జి సమీపంలోని పెద్దపాపయ్యపల్లికి వెళ్లే మార్గంలో, ఎస్సారెస్పీ కాలువ వద్ద ఓ యువకుడిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేష్ (35) హత్యకు గురైనట్లు సమాచారం. వరుసకు మామ అయ్యే అదే గ్రామానికి చెందిన అంబరగొండ ప్రశాంత్ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హత్యకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.


వడిగే రాకేష్ (ఫైల్ ఫోటో)

రెండు నెలలుగా రెక్కీ.. డ్రైవర్ ద్వారా పక్కా స్కెచ్?
స్థానికంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రాకేష్‌ను హతమార్చేందుకు ప్రశాంత్ కొంతకాలంగా పథకం రచించినట్లు ప్రచారం జరుగుతోంది. తన హార్వెస్టర్ డ్రైవర్‌ను రాకేష్‌కు పరిచయం చేసి, అతడిని హుజూరాబాద్‌కు రప్పించేలా పథకం రూపొందించినట్లు తెలుస్తోంది.
నిన్న రాత్రి రాకేష్‌ను హనుమకొండ నుంచి బైక్‌పై హుజూరాబాద్‌కు తీసుకొచ్చి, పెద్దమోరీ సమీపంలోని ఓ బార్‌లో మద్యం తాగించిన అనంతరం నిందితుడికి సమాచారం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. అనంతరం రాకేష్‌ను పెద్దపాపయ్యపల్లి సమీపంలోని ఎస్సారెస్పీ కాలువ వద్దకు తీసుకెళ్లి కత్తితో దాడి చేసినట్లు సమాచారం.
అయితే ఈ హత్యలో ప్రశాంత్ ఒక్కడే పాల్గొన్నాడా? లేక అతనితో పాటు మరికొందరు కూడా ఉన్నారా? అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య జరిగిందా?
ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గత ఆగస్టు 15న భీమారం ప్రాంతంలోని ఓయో లాడ్జిలో రాకేష్, ప్రశాంత్ భార్యకు సంబంధించిన వ్యవహారం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయమై ఇరువురి మధ్య గతంలో గొడవలు జరిగి పోలీస్‌స్టేషన్ వరకు పంచాయతీ వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. గతంలో ఒకసారి రాకేష్ ముక్కు మూసి చంపేందుకు ప్రశాంత్ ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ గొడవ తర్వాత ప్రశాంత్ భార్య తన పుట్టింటికి వెళ్లినట్లు, అక్కడి నుంచే వివాదం కొనసాగినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాకేష్ తనకు ప్రాణహాని ఉందని భావించి హనుమకొండలో గుట్టుగా ఉంటున్నాడనే ప్రచారం కూడా ఉంది.
అయితే ఈ విషయాలన్నీ ప్రస్తుతం పోలీసుల అధికారిక నిర్ధారణకు లోబడి ఉన్న అంశాలే.
ఆరుగురు అదుపులో ఉన్నట్లు ప్రచారం!
హత్య అనంతరం నిందితుడు కమలాపూర్ పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అనంతరం హుజూరాబాద్ పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా సంఘటనా స్థలంలో ఆధారాలు, వేలిముద్రలను సేకరించినట్లు సమాచారం.
ఈ కేసులో హత్యకు సహకరించినట్లు అనుమానిస్తున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, దీనిపై పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయాల్సి ఉంది.
ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లి..
రాకేష్ తండ్రి 8 ఏళ్ల క్రితం మృతి చెందగా తల్లికి ఒక్కగానొక్క కుమారుడని స్థానికులు చెబుతున్నారు. కుమారుడి దారుణ హత్యతో తల్లి వృద్ధాప్యంతో బాధపడుతూ ఉండగా ఈ సమయంలో అండగా ఉండాల్సిన కొడుకు మృతి చెందడంతో ఆమె రోదన పలువురిని కలచివేసింది.
ఈ ఘటనతో ఉప్పలపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హుజూరాబాద్ పోలీసులు కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు అసలు కారణం ఏమిటి? రాకేష్‌ను హతమార్చడంలో ఎంతమంది పాల్గొన్నారు? హత్యకు ముందుగా పక్కా పథకం రచించారా? అనే ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమైన సమాధానం లభించనుంది.
24 గంటల్లో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సమాచారం.

