కరీంనగర్‌లో ఘనంగా అభివృద్ధి పండుగ : IDOC ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వంలో ఉన్న 10.5 లక్షల మంది ఉద్యోగులే అంకితభావంతో సేవలందిస్తున్నారని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొనియాడారు. కేవలం 3 శాతం మంది ఉద్యోగులు 95 శాతం ఉన్న ప్రజలకు సేవలు అందించడం ఎంతో శ్రమ, నిబద్ధతతో కూడుకున్న పని అని, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడే పేదలకు సంక్షేమ ఫలాలు చేరుతాయని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (IDOC)ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ‘తెలంగాణ తల్లి’ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

రూ.944 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
కరీంనగర్ జిల్లాలో రూ.944 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతో పాటు మరికొన్ని నూతన పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూ.840 కోట్ల నిధులు సాధించినట్లు వెల్లడించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కేంద్రంతో సమన్వయంతో పనిచేస్తామని, రాష్ట్ర పురోగతికి కేంద్రం సహకరిస్తే అభినందించడంలో ఎలాంటి శషబిషలు లేవని స్పష్టం చేశారు.

కంటోన్మెంట్ భూముల కేటాయింపు – ఎలివేటెడ్ కారిడార్
కరీంనగర్ – హైదరాబాద్ మార్గంలో దశాబ్దాలుగా ఉన్న కంటోన్మెంట్ సమస్యను తాము అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పరిష్కరించామని సీఎం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసి విజ్ఞప్తి చేయడంతో దాదాపు 170 ఎకరాల భూమిని రాష్ట్రానికి కేటాయించారని చెప్పారు. అక్కడ రూ.5 వేల కోట్లతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌ను ఏడాదిలోపు పూర్తి చేస్తామని, అలాగే బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి రహదారి నిర్మాణానికి కూడా అనుమతులు సాధించామని వివరించారు.

ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే నిరుపేదలను కుటుంబ సభ్యులుగా భావించి సేవలు అందించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ప్రతి నెలా 1వ తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని, ప్రమోషన్లు, బదిలీలు, పీఆర్సీ, ఆరోగ్య భద్రత వంటి సమస్యలను వరుసగా పరిష్కరిస్తున్నామని చెప్పారు. మిగిలిన సమస్యలను కూడా ప్రజలకు సేవలు అందిస్తూనే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.


ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రజాప్రతినిధులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. త్వరలోనే కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై పూర్తిస్థాయి సమీక్ష నిర్వహిస్తానని సీఎం వెల్లడించారు.

