విధ్వంసం నుంచి వికాసం వైపు తెలంగాణ ప్రయాణం : సీఎం రేవంత్ రెడ్డి.. – సిరిసిల్ల బహిరంగ సభలో ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ ప్రసంగం. -సిరిసిల్ల నేతన్నల నైపుణ్యం ప్రపంచానికే గర్వకారణం, – గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం. – నేరెళ్ల బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్
(సిరిసిల్ల ): ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ గతంలో విధ్వంసమైన తెలంగాణను వికాసం వైపు నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి బాట’ కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.



ఈ సందర్భంగా సిరిసిల్ల నేతన్నల ప్రతిభను సీఎం ఆకాశానికెత్తారు. “మనిషి నాగరికత వస్త్రంతోనే ప్రారంభమైంది. అలాంటి వస్త్ర పరిశ్రమకు, చేనేత-చేతివృత్తులకు సిరిసిల్ల ప్రధాన కేంద్రం. అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యంతో చీరను నేసే గొప్ప కళాకారులు ఈ ప్రాంతంలో ఉన్నారు. చేనేత మగ్గాల నుంచి పవర్ లూమ్‌ల వరకు వేలాది కుటుంబాలు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నాయి” అని పేర్కొన్నారు.
గత ప్రభుత్వం పదేళ్ల కాలంలో చేనేత రంగానికి రూ. 2,234 కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ. 1,751 కోట్లు వెచ్చించిందని వివరించారు. ఇదే సమయంలో నేరెళ్ల బాధితులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందజేశారు.


గల్ఫ్ కార్మికులకు భరోసా:
సిరిసిల్ల ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువమంది వలస వెళ్తారని గుర్తుచేసిన సీఎం, గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు ఏ కార్మికుడైనా మరణిస్తే వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

క్షేత్రస్థాయిలో సంక్షేమ ఫలాలు:
అభివృద్ధితో పాటు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, కొత్త రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి పథకాలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర రావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

