హుజురాబాద్ సమీపంలో దారుణం : వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడి హత్య.. – నలుగురు నిందితుల అరెస్ట్, ఐదుగురు పరారీ!

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, అక్టోబర్ 01: వివాహేతర సంబంధం మరియు పాత కక్షల నేపథ్యంలో ఒక యువకుడిని పథకం ప్రకారం మద్యం మత్తులో ముంచి, కత్తులతో నరికి దారుణంగా హత్య చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడితో సహా నలుగురిని హుజురాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

ఏసీపీ వాసంశెట్టి మాధవి కథనం వివరాల్లోకి వెళ్తే:
కమలాపూర్ మండలం ఉప్పల్ పల్లి గ్రామానికి చెందిన వడిగే రాకేష్ (30) మరియు అదే గ్రామానికి చెందిన అమరగొండ ప్రశాంత్ (A1)ల మధ్య వివాహేతర సంబంధం విషయమై గతంలో గొడవలు జరిగాయి. పంచాయితీలు పెట్టినా కక్షలు మర్చిపోని ప్రశాంత్, రాకేష్ ను అంతమెందించేందుకు పక్కా వ్యూహం రచించాడు. తన మాజీ డ్రైవర్ రాజ్ కుమార్ (A2)తో పాటు రిత్విక్ (A3), తుమ్ముల అఖిల్ (A4), T. అఖిల్ (A5), రాహుల్ (A6), B. చందు (A7), B. అజయ్ (A8), గణేష్ (A9)లతో కలిసి హత్యకు పథకం వేశాడు. ఈ ఒప్పందంలో భాగముగా A2 నుండి A4 వరకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున, A5 నుండి A9 వరకు ఒక్కొక్కరికి ₹20,000 చొప్పున సుపారీ ఇచ్చేందుకు అంగీకరించాడు.
పథకం ప్రకారం.. A2 రాజ్ కుమార్ బాధితుడు రాకేష్ కు మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. ఈ నెల 27న అతడిని ఎల్కతుర్తికి, అక్కడి నుండి హుజురాబాద్ కు రప్పించి ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. అనంతరం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులోని ఎస్.ఆర్.ఎస్.పి. (SRSP) కాలువ వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ ముందే వేచి ఉన్న ప్రశాంత్ మరియు ఇతర నిందితులు రాకేష్ పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. రాకేష్ తప్పించుకునేందుకు యత్నించినప్పటికీ, ప్రశాంత్ కత్తితో అతడి గొంతు కోసి ఘోరంగా హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యారు.
పోలీసుల వేగవంతమైన దర్యాప్తు:
28వ తేదీ ఉదయం లభించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కాలువలో లభ్యమైన మృతదేహాన్ని రాకేష్ గా గుర్తించారు. మృతుడి తల్లి వడిగే దేవక్క ఇచ్చిన ఫిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీసులు కేసు (Cr.No.288/2026 U/Sec.103(1) r/w 3(5) BNS) నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. క్లూస్ టీమ్ ఆధారాలు, కాల్ డిటెయిల్స్ సహాయంతో విచారణ చేపట్టారు.
నలుగురు అరెస్ట్ – సామాగ్రి స్వాధీనం:
అక్టోబర్ 01న నిందితులు ఎల్కతుర్తిలోని ఒక అద్దె ఇంట్లో ఉన్నారన్న పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు అమరగొండ ప్రశాంత్ (A1), రాజ్ కుమార్ (A2), అమరగుండ రిత్విక్ (A3), తుమ్ముల అఖిల్ (A4)లను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు మరియు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సీజర్ ప్రక్రియ అంతటినీ ‘ఈ-సాక్ష్య’ ద్వారా వీడియో రికార్డు చేశారు.
అరెస్టయిన నలుగురు నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఏసిపి మాధవి తెలిపారు. పరారీలో ఉన్న మిగతా ఐదుగురు నిందితుల (A5 నుండి A9) కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు హుజురాబాద్ ఏసిపి, టౌన్ సిఐ బి కరుణాకర్, ఎస్సై రవి, పోలీసులు వెల్లడించారు.

