హుజూరాబాద్ సింగిల్ విండో చైర్మన్ రేసులో కొలిపాక శంకర్

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేయడంతో హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ రాజకీయం వేడెక్కింది. హుజూరాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సింగిల్ విండో) చైర్మన్ పదవి రేసులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొలిపాక శంకర్ ముందు వరుసలో నిలిచారు.
గత ప్రభుత్వ హయాంలో సింగిల్ విండో పాలకవర్గాన్ని ఎన్నికల ద్వారా ఎన్నుకోగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ విధానాన్ని మార్చి నామినేటెడ్ పద్ధతిలో చైర్మన్లు, డైరెక్టర్లను నియమించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గతంలో సింగిల్ విండో డైరెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న శంకర్.. ఈసారి చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
40 ఏళ్ల పార్టీ సేవలు:
గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని ఉన్న కొలిపాక శంకర్.. గతంలో హుజూరాబాద్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా, మహాత్మా గాంధీ సూపర్ బజార్ డైరెక్టర్ గా, సింగిల్ విండో డైరెక్టర్ గా రకరకాల బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం హుజూరాబాద్ పట్టణంలోని శ్రీ ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ చైర్మన్ గా కొనసాగుతున్నారు.
–కష్టకాలంలో జెండా మోసిన వారికే ప్రాధాన్యం ఇవ్వాలి:
పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా జెండా మోసి, కాంగ్రెస్ వాదిగా నిలబడిన వారికి నామినేటెడ్ పోస్టుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని శంకర్ కోరారు. “అధిష్టానం నా సేవలను గుర్తించి సింగిల్ విండో చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ నాకు కాకపోయినా, నాలాగా పార్టీ మారకుండా నమ్ముకున్న ఏ ఇతర సీనియర్ కార్యకర్తకైనా ఈ పదవి ఇచ్చినా స్వాగతిస్తాను” అని ఆయన పేర్కొన్నారు.

