కందుగులలో బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం పంపిణీ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్, అక్టోబర్ 01 : హుజూరాబాద్ మండలం కందుగుల గ్రామంలో ‘పోషణ్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు గురువారం పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామ సెక్రటరీ మధుకర్, ఉప సర్పంచ్ మండ సతీష్ ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పౌష్టికాహార కిట్లను అందజేశారు.


మాట్లాడుతున్న ఉపసర్పంచ్ మండ సతీష్ గౌడ్..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తోందని, దీనిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన సమయానికి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా తల్లి, పిల్లలు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. గర్భిణీలు, బాలింతలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ (ICDS) సూపర్‌వైజర్ జ్యోతి, అంగన్వాడీ టీచర్ రజితతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

