వేములవాడలో ఘనంగా ముగిసిన రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు : విజేతలకు బహుమతులు ప్రదానం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, రాజన్న సిరిసిల్ల (వేములవాడ): దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధిలో నాలుగు రోజుల పాటు (2వ తేదీ నుండి 5వ తేదీ వరకు) అంగరంగ వైభవంగా సాగిన రాష్ట్ర స్థాయి బాల-బాలికల కబడ్డీ క్రీడోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు సమావేశానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై, ఫైనల్ మ్యాచ్‌లను వీక్షించడంతో పాటు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.


ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, విప్ ఆది శ్రీనివాస్ క్రీడాకారులతో కలిసి మైదానంలో సరదాగా కబడ్డీ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.
రోమాంచితంగా ఫైనల్ మ్యాచ్‌లు:

- బాలికల విభాగం: హోరాహోరీగా సాగిన ఫైనల్ పోరులో ఖమ్మం జిల్లా జట్టుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాలికల జట్టు విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది.
- బాలుర విభాగం: వనపర్తి జిల్లా జట్టుపై నల్గొండ జిల్లా బాలుర జట్టు ఘన విజయం సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది.

పిల్లలు సెల్‌ఫోన్ వీడి.. మైదానంలో ఆడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. 33 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా, క్రీడా స్ఫూర్తితో పాల్గొనడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణను క్రీడల్లో అగ్రగామిగా నిలిపేందుకు ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ఏర్పాటు, ‘సీఎం కప్’ వంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. రాబోయే ఒలింపిక్స్‌లో తెలంగాణ క్రీడాకారులు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నేటి పిల్లలు సెల్‌ఫోన్ స్క్రీన్ గేమ్స్‌కే పరిమితం కాకుండా మైదానంలో ఆడి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.

క్రీడలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. వేములవాడ రాజన్న సన్నిధిలో 33 జిల్లాల నుండి సుమారు 1,300 మందికి పైగా క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలు పండుగ వాతావరణంలో జరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. మట్టిలో మాణిక్యాల్లాంటి గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 42 రకాల క్రీడల్లో పోటీలు నిర్వహించామన్నారు. క్రీడలు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను నేర్పుతాయని, తల్లిదండ్రులు పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు.


పోటీలను విజయవంతంగా నిర్వహించిన రాజన్న సిరిసిల్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు, క్రీడాభిమానులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

