ఆనందోత్సాహాల మధ్య ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు.. – బతుకమ్మల వద్ద పోటెత్తిన మహిళలు.. – అన్ని ఏర్పాట్లు చేసిన బల్దియ పాలకవర్గం.

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: తెలంగాణలో హిందువులు పవిత్రంగా జరుపుకునే బతుకమ్మ పండుగ వేడుకల్లో భాగంగా హుజురాబాద్ పట్టణంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు మహిళలు ఆనందోత్సాహాల మధ్య మహిళలు జరుపుకున్నారు. బతుకమ్మ వేడుకలు పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని మహిళలు గునుగు, తంగేడు, బంతి, చామంతి, ఉద్రాక్ష, పట్టుకుచ్చులు లాంటి వివిధ రకాల పువ్వులను కొనుగోలు చేసి బతుకమ్మలను పేర్చి గౌరమ్మ(దుర్గా దేవికి)కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ కుటుంబాన్ని, మాంగల్యాన్ని చల్లగా చూడాలని వేడుకున్నారు. సాయంత్రం రంగురంగుల దుస్తులను ధరించి మహిళలు తమ పేర్చిన బతుకమ్మలను హుజురాబాద్ పట్టణంలో శివాలయం, మామిండ్లవాడ, విద్యానగర్, కాకతీయ కాలనీ, పద్మానగర్, సంతోష్ మాత దేవాలయం, హనుమాన్ దేవాలయం, ఇందిరానగర్, దమ్మక్క పేట, ఇప్పల నర్సింగాపూర్, బోర్నపల్లి తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేదికల వద్ద బతుకమ్మలను ఉంచి బతుకమ్మ…. బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో…. అంటూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తాము తయారుచేసిన ఫలహారాలను ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు. బతుకమ్మ పండుగ వేడుకల కోసం మున్సిపల్ పాలకవర్గం, అధికారులు పట్టణంలో భారీ ఏర్పాట్లు చేశారు. చైర్ పర్సన్ రొoటాల సుహాసిని, వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, కమిషనర్ బి కిషన్, కౌన్సిలర్లు, కో – ఆప్షన్ సభ్యులు అధికారులు బతుకమ్మ పండుగ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి వేడుకల్లో పాల్గొన్నారు. శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా ఎసిపి వాసంశెట్టి మాధవి ఆధ్వర్యంలో హుజురాబాద్ టౌన్ సిఐ టీ కరుణాకర్, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.





–గ్రామాలలో బతుకమ్మ వేడుకలు
హుజురాబాద్ పట్టణంతోపాటు మండలంలోని అన్ని గ్రామాలలో చిన్న బతుకమ్మ పండుగ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో ఆనందోత్సవాల మధ్య మహిళలు జరుపుకున్నారు. బతుకమ్మ పండుగ జరుపుకునే ప్రాంతాల్లో గ్రామపంచాయతీ పాలకవర్గం సర్పంచి ఆధ్వర్యంలో ఏర్పాట్లను భారీ ఎత్తున చేశారు. విద్యుత్ దీపాలతో పాటు రంగురంగుల బల్బులను ఏర్పాటుచేసి బతుకమ్మ ఆడే ప్రాంతాలను శోభయమానంగా తయారు చేశారు.



