బాలగోపాల్ సేవలు మరువలేనివి : హుజురాబాద్‌లో ఘనంగా 17వ వర్ధంతి సభ

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్‌లోని విఎల్ఆర్ హాల్‌లో మానవ హక్కుల వేదిక, దళిత మరియు ప్రజా సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ హక్కుల నాయకుడు డాక్టర్ కె. బాలగోపాల్ 17వ వర్ధంతి సభ ఆదివారం అత్యంత ఘనంగా జరిగింది. డాక్టర్ ఎస్. తిరుపతయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో పలువురు ప్రముఖులు, వక్తలు ఆయన సేవలను స్మరించుకున్నారు.
సభలోని వక్తల నివాళి: తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య, మానవ హక్కుల వేదిక నాయకులు ఎస్. జీవన్ కుమార్, డాక్టర్ ఎస్. తిరుపతయ్య, తెలంగాణ జన సమితి నాయకులు, న్యాయవాది ముక్కెర రాజు, ఆవునూరి సమ్మయ్య, హేతువాద సంఘం నాయకురాలు రమ, హుజురాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కాయిత రాములు తదితరులు ప్రసంగించారు.

ఆనాటి కొండంత ధైర్యం: మూడున్నర దశాబ్దాల పాటు హక్కుల రంగంలో మేధావిగా, నాయకునిగా బాలగోపాల్ అందించిన సేవలను వక్తలు కొనియాడారు. ఆయన ఈ కాలంలో జీవించి ఉంటే అణగారిన వర్గాలకు కొండంత ధైర్యంగా ఉండేదని అభిప్రాయపడ్డారు.
ప్రముఖుల భాగస్వామ్యం: ఈ కార్యక్రమంలో బండ శ్రీనివాస్, వర్దినేని రవీందర్ రావు, జీడి సారయ్య, సామ్రాజ్యం, భీమోజు సదానందం, పొడిశెట్టి వెంకట్రాజం, పల్కల ఈశ్వర్ రెడ్డి, వేల్పుల రత్నం, మార్త రవీందర్, వేల్పుల ప్రభాకర్, శివ దయాల్ సింగ్, కొత్తూరి రమేష్, బత్తుల తిరుపతి, మట్టెల తిరుపతి, జీడి రవితేజ, మార్వాడీ సుదర్శన్, రామంచ భరత్, బాబ్జీ తదితరులు సందేశాలు అందజేశారు.
ముఖ్యమైన తీర్మానాలు:
సభలో నిర్వాహకులు ప్రవేశపెట్టిన క్రింది తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది:
మరణ శిక్షల రద్దు: ఈ సెప్టెంబరులో NIA కోర్టు జీరం ఘాటీ నిందితులకు విధించిన ఉరిశిక్షలను వెంటనే రద్దు చేయాలని, ఇప్పటికే 13 సంవత్సరాల జైలు జీవితం అనుభవించినందున వారిని వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే సీఆర్పీసీకి సవరణ చేసి దేశంలో ఎవరికీ, ఏ నేరాలకూ మరణ శిక్షలు విధించకుండా ఈ శిక్షా రూపాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈసీఐపై నిరసన: దేశంలో కోట్లాది మంది సామాన్య ప్రజల ఓటు హక్కును రద్దు చేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ చేత ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయించాలని తీర్మానించారు.
నిర్బంధం ఆపాలి: నిరసన తెలుపుతున్న కాక్రోచ్ జనతా పార్టీ మరియు ఇతర నిరసనకారులపై కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్బంధాన్ని తక్షణమే ఆపివేయాలని కోరారు.

