రైతు నేస్తం V.C : ఎల్ నినో విపత్తు వేళ ప్రత్యామ్నాయ పంటలే శ్రేయస్కరం – ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు తుమ్మల, పొన్నం

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజూరాబాద్ :
ప్రపంచవ్యాప్తంగా విరుచుకుపడుతున్న ‘ఎల్ నినో’ విపత్తు కారణంగా రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగం ఎదుర్కొనే సవాళ్లు, వాటి నివారణోపాయాలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు దిశానిర్దేశం చేసింది. సోమవారం రోజున నిర్వహించిన “రైతు నేస్తం” వీడియో కాన్ఫరెన్స్ వేదికగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు రాష్ట్ర రైతాంగానికి కీలక సూచనలు అందించారు.


సమావేశంలో ప్రధానమైన మార్గదర్శకాలు:
ప్రత్యామ్నాయ పంటల సాగు: వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడం మరియు ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు క్షీణించిన దృష్ట్యా… రైతులు యాసంగిలో వరి పంటకు బదులుగా తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పు దినుసులు (పెసర, మినుము, కంది, శనగ) మరియు నూనె గింజల పంటలను (కుసుమ, వేరుశనగ, నువ్వులు) సాగు చేయాలని పిలుపునిచ్చారు.
క్రాప్ హాలిడే & నేల సంరక్షణ: ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలం కాని పక్షంలో “క్రాప్ హాలిడే” పాటించాలని, లేదా నేల సంరక్షణ చర్యలు చేపట్టి మట్టి సారాన్ని కాపాడుకోవాలని సూచించారు.
తాగునీరు, విద్యుత్‌కు ప్రాధాన్యం: రిజర్వాయర్లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటికి మరియు విద్యుత్ ఉత్పత్తికి ప్రాధాన్యతగా వినియోగించనున్నట్లు తెలిపిన మంత్రులు, నీటి లభ్యతను బట్టి అధికారులు సూచించిన యాజమాన్య పద్ధతులనే పాటించాలని స్పష్టం చేశారు. అనవసరంగా పంటలు వేసి నీరందక నష్టపోవద్దని హెచ్చరించారు.
హైడ్రాలజీ, అగ్రికల్చర్, ఉద్యానవన, విద్యుత్, వెటర్నరీ తదితర శాఖల అధికారులు రాబోయే కాలంలో పాటించాల్సిన మెలకువలను రైతులకు వివరించారు.
హుజూరాబాద్ రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం:
ఈ రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమాన్ని హుజూరాబాద్ రైతు వేదిక నుండి హుజూరాబాద్ ఏడీఏ సునీత, సెరికల్చర్ ఏడీఏ వెంకన్న, ఆర్టికల్చర్ ఆఫీసర్ మధులిక, ఎలక్ట్రిసిటీ ఏఈ రమేష్, ఆత్మ చైర్మన్ సమ్మిరెడ్డిలతో పాటు పలువురు ఏఈఓలు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక రైతులు పెద్ద ఎత్తున తిలకించి సూచనలు నమోదు చేసుకున్నారు.
@@లోకల్ యాడ్స్@@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: శ్రీ పంజాల మనోజ్ (బంటి) గారు, 21వ వార్డ్ కౌన్సిలర్, బిజెపి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ హుజురాబాద్ పురపాలక సంఘం.

