Social 1080×1350 • Multi-page
13-10-2026 BREAKING NEWS 06:34 PM
swarnodayam.com
Telugu Daily News

జాతీయ రహదారిపై ధర్నాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు : హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి హెచ్చరిక

జాతీయ రహదారిపై ధర్నాలు చేపట్టి ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు :  హుజురాబాద్ ఏసీపీ వాసంశెట్టి మాధవి హెచ్చరిక
IMG-20261013-WA0072

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి ​హుజురాబాద్, అక్టోబర్ 13 :
సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ చట్టబద్ధమైన మార్గాలను అనుసరించాలని, జాతీయ రహదారులపై ధర్నాలు నిర్వహించి ప్రజా రవాణాకు అంతరాయం కలిగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హుజురాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ) వాసంశెట్టి మాధవి హెచ్చరించారు. మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడారు.
​–దర్యాప్తునకు సహకరించాలి:
హుజురాబాద్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఆరు మండలాల్లో ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అధికారులు సమగ్రంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. ప్రతి కేసులో ఆధారాలు సేకరించి చట్టప్రకారం విచారణ పూర్తి చేయడానికి కొంత సమయం పడుతుందని, ఫిర్యాదుదారులు పోలీసులపై నమ్మకం ఉంచి దర్యాప్తునకు సహకరించాలని కోరారు.
​సైదాపూర్ ఘటన మరియు నమోదు చేసిన కేసుల వివరాలు:
సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన బజ్జూరి తిరుమల (57) ఇచ్చిన ఫిర్యాదు మేరకు 09.10.2026న క్రైమ్ నెం. 179/2026 (U/Sec. 118(2), 292, 351(2) r/w 3(5) BNS) కింద కేసు నమోదు చేశామని, సంబంధిత వ్యక్తిని విచారించి వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపినట్లు తెలిపారు.

–​జాతీయ రహదారిపై ఆందోళనతో మరో కేసు:

అయితే, అక్టోబర్ 11న బజ్జూరి తిరుమలకు అన్యాయం జరిగిందంటూ చల్లూరి కోమల, మొలుగూరి లక్ష్మి మరికొందరు మహిళలతో కలిసి ఏసీపీ కార్యాలయానికి వచ్చారని, ఆ సమయంలో ఏసీపీ అందుబాటులో లేకపోవడంతో జాతీయ రహదారిపైకి వెళ్లి సుమారు 30 నిమిషాల పాటు ధర్నా చేశారని పేర్కొన్నారు. దీనివల్ల తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలిపారు. దీంతో హుజురాబాద్ పి.ఎస్ లో క్రైమ్ నెం. 308/2026 (U/Sec. 189, 126(2) BNS) కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

–​పునరావృతమైతే కఠిన చర్యలు: ఏసిపి

సదరు వ్యక్తులు గతంలో బోర్నపల్లి గ్రామంలో కూడా ఇదే రీతిలో ధర్నా చేశారని, అప్పట్లో హెచ్చరించి వదిలేసినప్పటికీ మళ్లీ రస్తారోకోకు దిగడంతో ఈసారి కేసు నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. అత్యవసర వైద్య సేవల కోసం వెళ్లే రోగులు, విద్యార్థులు, ఉద్యోగుల ప్రయాణాలకు ఆటంకం కలిగించడం సమంజసం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

—​ఫిర్యాదుల సమర్పణపై ఏసీపీ సూచనలు:

​పోలీస్ అధికారులపై లేదా దర్యాప్తుపై ఏవైనా అభ్యంతరాలు, ఫిర్యాదులు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించే శ్రేణి విధానాన్ని ఏసీపీ వివరించారు:
​మొదటి స్థాయి: ఎస్ఐ/ఐఓపై ఫిర్యాదులు ఉంటే సంబంధిత సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) కి విన్నవించాలి.
​రెండవ స్థాయి: సర్కిల్ ఇన్స్పెక్టర్ పై ఫిర్యాదు ఉంటే డివిజనల్ ఏసీపీ (ACP) ని కలవాలి.
​ఉన్నత స్థాయి: ఇతర పోలీస్ అధికారులపై అభియోగాలు ఉంటే పోలీస్ కమిషనర్ (CP) దృష్టికి తీసుకెళ్లవచ్చు.

​“చట్టంపై ప్రతి ఒక్కరూ నమ్మకం ఉంచాలి. ప్రజా రవాణాకు ఆటంకం కలిగించకుండా, శాంతియుతమైన చట్టబద్ధ మార్గాల్లోనే సమస్యల పరిష్కారానికి పోలీసు అధికారులను సంప్రదించాలి.”అని ఏసీపీ హుజురాబాద్ వాసంశెట్టి మాధవి తెలిపారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!